అజ్ఞాతంలో.. మీసం మెలేసి, తొడలు చరిచిన ఆ జిల్లా వైసీపీ నాయకులు..!

ఇలా నేతలు ఎవరూ బయటకు రాకపోవడం కార్యకర్తలను వేదనకు గురిచేస్తోంది. పదవులు అనుభవించిన వారే బయటకు రాకుంటే.. ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.

అజ్ఞాతంలో.. మీసం మెలేసి, తొడలు చరిచిన ఆ జిల్లా వైసీపీ నాయకులు..!

Gossip Garage : ఆ జిల్లా వైసీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితాలు వచ్చి 20 రోజుల తర్వాత కూడా ఎవరూ ముఖం చూపడం లేదు. ప్రజల తిరస్కరణతో ఇంటికే పరిమితమైన నేతలు… తమ కార్యకర్తలకు కూడా దర్శనమివ్వడం లేదు. చివరికి పార్టీ పని ఉన్నా…. తమకేం సంబంధం అన్నట్లే వ్యవహారం నడుపుతున్నారు. ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు తమను మించిన వారు లేనట్లు… మీసాలు మెలేసి… తొడలు చరిచిన నేతలు.. ఇప్పుడు ఇలా బెదిరిపోవడమేంటి? అంటూ సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు.

నాయకుల తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాయకుల వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాల పునర్విభజనలో ఈ జిల్లాను మూడు జిల్లాలు చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలుగా మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలను విభజించారు. ఈ మూడు జిల్లాల్లోనూ రెండు పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి రాజమండ్రిలోనూ… ఇంకొకటి కాకినాడలోనూ ఉన్నాయి. అధికారంలో ఉండగా, ఈ పనులు గుట్టుచప్పుడుగా సాగిపోయాయి. కానీ, ఇటీవల తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేత తర్వాత ఈ రెండింటికీ అనుమతులు లేవని తేలింది. ఇక వీటిని ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ నోటీసులిచ్చింది ప్రభుత్వం. ఐతే ఈ ఎపిసోడ్‌లో ప్రభుత్వం-వైసీపీ మధ్య వ్యవహారం ఎలా ఉన్నా… స్థానిక వైసీపీ నేతల తీరే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఎన్నికలకు ముందు తెగ హడావిడి చేశారు..
ఈ ఎన్నికలకు ముందువరకు ఉమ్మడి జిల్లాలో వైసీపీకి 14 మంది ఎమ్మెల్యేల బలం ఉండేది. ముగ్గురు మంత్రులతోపాటు ఇద్దరు ఎంపీలు ఉండేవారు. ఇక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ రూరల్‌కు చెందిన కురసాల కన్నబాబు పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు. వీరికి అదనంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి కూడా జత కలిశారు. మాజీ మంత్రుల్లో దాడిశెట్టి రాజా, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీల్లో భరత్‌ జిల్లా వైసీపీలో తెగ హడావిడి చేసేవారు.

ఓటమి తర్వాత కనిపించని నాయకులు..
ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత వీరిలో ఏ ఒక్కరూ కనిపించడం లేదు. ముఖ్యంగా మూడు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ అయినా ఏ ఒక్కరూ స్పందించకపోవడం కార్యకర్తల అసంతృప్తికి కారణమవుతోంది. కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లాకు జక్కంపూడి రాజా, కోనసీమ జిల్లాకు పొన్నాడ సతీశ్‌కుమార్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు పార్టీతో కానీ, ఆ నోటీసులతో కానీ తమకు పని లేదన్నట్లు వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది.

పవన్ కల్యాణ్ ను తిట్టేందుకు పోటీలుపడ్డారు..
అధికారంలో ఉన్నన్ని రోజులు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వంటి వారు ఏ చిన్న విషయమైనా ప్రతిపక్షంపై విరుచుకుపడే వారు. ముఖ్యంగా జనసేనాని పవన్‌పై విమర్శలు చేయాలంటే కన్నబాబు, ద్వారంపూడితో పాటు భరత్‌, రాజా పోటీ పడేవారు. ఐతే ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైన తర్వాత వీరంతా షాక్‌ తిన్నారు. ఎవరూ పల్లెత్తు మాట్లాడం కాదు కదా, కనీసం బయటకు కనిపించడం లేదు. నేతల తీరును గమనిస్తున్న కార్యకర్తలు… ఒక్క ఓటమితో ఇంతలా కుంగిపోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.

ముద్రగడతో పవన్‌ను అవమానించేలా మాట్లాడించడం కూడా దెబ్బతీసింది..
ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులైనా ఏ ఒక్కరూ తమ ఓటమికి కారణాలు విశ్లేషించుకోలేదు. దీనిపైనా కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాను టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. జనసేనాని పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేయడం తీవ్రంగా ప్రభావితం చేసింది. పవన్‌పై విమర్శలు చేయడానికి పోటీపడిన వైసీపీ నేతలు, శృతిమించి వ్యవహరించినందునే ఇలాంటి ఫలితాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనే విశ్లేషణలపైనా ఎవరూ నోరు మెదపడం లేదు. పార్టీతో సంబంధం లేని కాపు ఉద్యమ నేత ముద్రగడను ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకువచ్చి… పవన్‌ను అవమానించేలా మాట్లాడించడం కూడా దెబ్బతీసింది.

ఒక్క ఓటమితో దయనీయ స్థితి..
వీటిన్నింటికీ జిల్లా నేతలు బాధ్యత వహించాల్సి ఉన్నా.. ఎవరూ తప్పు మాది కాదన్నట్లే తప్పించుకోడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాత్రమే ఒకసారి మీడియా ఎదుటకు వచ్చారు. పార్టీ ఓటమికి CMOలోని కొందరు అధికారులే కారణమని విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయనా సైలెంట్‌గానే ఉండిపోయారు. ఇలా నేతలు ఎవరూ బయటకు రాకపోవడం కార్యకర్తలను వేదనకు గురిచేస్తోంది. పదవులు అనుభవించిన వారే బయటకు రాకుంటే.. ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. మొత్తానికి ఒక్క ఓటమి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీని దయనీయ స్థితికి చేర్చేసిందనే చెప్పాలి.

Also Read : జైలు తప్పదా? వైసీపీ నేతలను టెన్షన్ పెడుతున్న పవన్ కల్యాణ్