Gossip Garage: కార్యకర్తే అధినేత నినాదం వెనుక వ్యూహం ఏంటి? కార్యకర్తల భుజం తట్టడంలో ప్లాన్ అదేనా?
ఐదేళ్లలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెడుతూ, అభివృద్ధిని స్పీడప్ చేస్తూనే..పార్టీ పటిష్టతపై కూడా ఫోకస్ పెట్టారు.

Gossip Garage: చరిత్రను తిరగరాసే విజయం సాధించారు. తిరుగులేని మెజార్టీతో కూటమిగా పవర్ లో ఉన్నారు. అయినా కార్యకర్తే అధినేత అంటోంది టీడీపీ హైకమండ్. క్యాడరే లీడర్, వారి కష్టం మీదే గెలిచాం, వారి సంక్షేమమే తమ ఎజెండా అని చెబుతోంది. కార్యకర్తే అధినేత నినాదం వెనుక వ్యూహం ఏంటి? సైకిల్ పార్టీ గేర్ మార్చిందా? పార్టీతో క్యాడర్ అటాచ్ మెంట్ పెరిగేలా స్కెచ్ వేస్తున్నారా? పదవులు ఇస్తూ ఆపదలో అండగా ఉంటూ కార్యకర్తల భుజం తట్టడంలో ప్లాన్ అదేనా?
ఏమిచ్చినా, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది. దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం మన పార్టీకి సొంతం. వేరే ఏ పార్టీ ఇవ్వని గౌరవం కార్యకర్తలకు టీడీపీ ఇస్తుంది. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి లోకేశ్ పదేపదే కార్యకర్తల గురించి చెబుతున్న మాటలు.
నిజానికి టీడీపీకి హార్డ్ కోర్ క్యాడర్ ఉంది. పార్టీ పవర్‌లో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా జెండా మోసేవాళ్లు కోకొళ్లలు. ఏకంగా కోటి మంది సభ్యత్వాలు ఉన్న టీడీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా బంపర్ మెజార్టీతో కూటమి పవర్‌లో ఉంది. పైగా టీడీపీనే 134 సీట్లతో పటిష్టంగా ఉంది. అయినా కార్యకర్తే అధినేత అంటున్నారు టీడీపీ నేతలు. క్యాడర్ ఫస్ట్ ఆ తర్వాతే ఏదైనా అని కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు.
సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట పొలిటికల్ గవర్నెన్స్. ఐదేళ్లలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెడుతూ, అభివృద్ధిని స్పీడప్ చేస్తూనే..పార్టీ పటిష్టతపై కూడా ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ప్రభుత్వమే.. పార్టీ పార్టీనే అంటూ..అన్ని స్థాయిల్లో పార్టీ నేతలకు, క్యాడర్‌కు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి ప్రాధాన్యమిస్తూ కొంతవరకే నామిటేడ్ పోస్టులు భర్తీ చేశారు. నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ మిస్ అయిందని భావిస్తున్నారట. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తు కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తి క్యాడర్‌లో ఉందట.
ఇక గత ఐదేళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కేసులు, వేధింపులు తట్టుకుని పోరాడారు. వారిలో అర్హులను గుర్తించి నామినేటెడ్ పదవులిస్తే క్యాడర్‌లో మరింత ఉత్సాహం వస్తుందని భావిస్తోంది పార్టీ. ఇంకొందరు అయితే పదవుల కంటే పార్టీ నాయకత్వం పిలిచి మాట్లాడితే, భుజం తట్టి అభినందిస్తే అదే పెద్ద గౌరవంగా భావిస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అలాంటి గుర్తింపు రాలేదన్న భావన చాలామందిలో ఉందట. 2014-19తో పోలిస్తే నామినేటెడ్ పదవుల భర్తీలో చంద్రబాబు కొంత వేగం పెంచారు. కానీ ఇప్పటికీ చాలా పదవులు భర్తీ చేయకపోవడంతో నిరాశ పెరుగుతోందని గ్రహించారట. దేవాలయాల ధర్మకర్తల మండళ్లు, మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌ల అధ్యక్షుల పదవులు పెండింగ్‌లో ఉన్నాయి.
కోటి సభ్యత్వాలతో పెద్ద రికార్డు సాధించింది టీడీపీ. అందుకే కార్యకర్తే అధినేత అనే స్లోగన్ తీసుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఆయన..2వేల 5వందల మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సాయం అందించారు. వివిధ ప్రమాదాల్లో చనిపోయిన 5వేల పైచిలుకు కార్యకర్తల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున సాయం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వేలాదిమంది కార్యకర్తలకు వైద్య సాయంతో పాటు..2వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. 5వేల కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచి రూ.19కోట్లు సాయం చేసినట్లు పార్టీ చెబుతోంది. జెండా మోసే ప్రతి కార్యకర్తలకు అండగా నిలవడమే అజెండా అంటోన్న టీడీపీ..నామినేటెడ్ పదవుల భర్తీతో క్యాడర్‌లో ఉన్న కాస్త అసంతృప్తిని కూడా చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది.