Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ..? మళ్లీ అరెస్ట్ తప్పదా, వెంటాడుతున్న మరో కేసు ఏంటి..

పలు కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ..కొన్ని రోజులుగా కనిపించడం లేదని..ఫోన్‌లో కూడా ఎవరికీ టచ్‌లోకి రావడం లేదన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ..? మళ్లీ అరెస్ట్ తప్పదా, వెంటాడుతున్న మరో కేసు ఏంటి..

Updated On : December 30, 2025 / 8:42 PM IST
  • ఇప్పటికే 137 రోజులు జైల్లో ఉన్న వంశీ
  • లేటెస్ట్‌గా మరో హత్యాయత్నం కేసుతో ఉచ్చు
  • ఫోన్ స్విచ్చాఫ్ చేసి వంశీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు టాక్                                                           

 

 Vallabhaneni Vamsi: అప్పుడే అయిపోలేదు. ఇంకా ఉంది. పిక్చర్ అబీ బాకీహై అంటోంది కూటమి సర్కార్. ఆ కేసులో అరెస్ట్..జైలుతోనే..గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్‌ ముగిసిపోలేదంటోంది. మరో కేసు వంశీని వెంటాడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వంశీ..సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి నోరు పారేసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. 137 రోజుల పాటు విజయవాడ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తొలుత గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వంశీపై పలు స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి. జూలై 1న నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో..అన్ని కేసుల్లో రిలీఫ్ దొరికినట్లు అయింది.
అజ్ఞాతంలోకి వంశీ..? ఫోన్ కూడా స్విచ్చాఫ్..

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌ రద్దుకు పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లినా..అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను అడ్డుకోలేదు. దీంతో వంశీ రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి తనపై నమోదైన కేసుల విచారణను ఫేస్ చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు కోర్టుకు హాజరవుతున్నారు. అయితే విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సత్యవర్ధన్‌ కేసు వాయిదాకు సోమవారం అటెండ్‌ కావాల్సి ఉన్నా వంశీ డుమ్మా కొట్టారని అంటున్నారు. దీంతో వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న టాక్ మొదలైంది. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా సైలెంట్ అయిపోయారన్న ప్రచారం జరుగుతోంది.

అరెస్ట్ భయంతోనే మళ్లీ అండర్ గ్రౌండ్ లోకి?

పలు కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ..కొన్ని రోజులుగా కనిపించడం లేదని..ఫోన్‌లో కూడా ఎవరికీ టచ్‌లోకి రావడం లేదన్న టాక్ ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే..వంశీని ప్రధాన నిందితుడిగా మెన్షన్ చేస్తూ ఈ నెల 17న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే వంశీ కనిపించడం లేదా అనే చర్చా తెరపైకి వచ్చింది. మాచవరం పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న అనుమానం, ఆందోళనతోనే వంశీ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లి ఉంటారని అంటున్నారు.

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi Representative Image (Image Credit To Original Source)

ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయాలంటూ..వల్లభనేని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని..దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో అతడిని తీవ్రంగా గాయపరిచారన్న అభియోగాలు మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాచవరం స్టేషన్‌లో కేసు నమోదైందని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వంశీ ఇంటికి వెళ్లారని..అయితే ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా వంశీకి రిలీఫ్ దక్కలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ స్విచ్చాఫ్ చేసి, వంశీ అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదా సోమవారం ఉండటంతో..కోర్టు వాయిదాకైనా వంశీ వస్తారని పోలీసులు భావించారట. కానీ వంశీ మాత్రం వాయిదాకు హాజరు కాలేదంటున్నారు. మరోవైపు సునీల్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు కూడా కోర్టుకు హాజరు కాలేదంటున్నారు.

తాజా కేసుతో వంశీకి మరోసారి ఉచ్చు బిగుసుకున్నట్లే..!

ఇదే సమయంలో..హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ అనుచరులు కూడా అజ్ఞాతంలోనే ఉన్నారని చెబుతున్నారు. పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే దాదాపు 11 కేసులపై బెయిల్ మీదున్నారు వంశీ. లేటెస్ట్‌గా నమోదైన కేసుతో వంశీకి మరోసారి ఉచ్చు బిగుసుకున్నట్లేనన్న ప్రచారం జరుగుతోంది. సునీల్‌పై హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయితే వంశీ మరింత చిక్కుల్లో పడ్డట్లేనన్న టాక్ వినిపిస్తోంది. వంశీ అరెస్ట్‌ తప్పదా? ఈ పరిస్థితి నుంచి ఆయన ఎలా గట్టెక్కబోతున్నారో చూడాలి.

Also Read: అసెంబ్లీకి కేసీఆర్..? రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా గులాబీ బాస్ ప్లాన్..