రాచమల్లు తీరుతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడిపోతున్నారా?
తీరు మార్చుకొని రాచమల్లుతో వైసీపీ నేతలకు వస్తున్న ఇబ్బందులేంటి?

Gossip Garage : ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మంచి మాటకారి. తన వాక్చాతుర్యంతో తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడని పేరు. తాను చెప్పిందే నిజమనేలా అందరినీ నమ్మించి మాట్లాడగల నేర్పరి కూడా. తన మీద చిన్న విమర్శ వచ్చినా ఓవర్‌గా రియాక్ట్ అయి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆయన నైజం. తప్పు చేసి ఉంటే తన తల్లిదండ్రులకే తాను పుట్టలేదంటూ..తాను నమ్మే శివుడిపైనా ప్రమాణం చేస్తాననంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రొద్దుటూరు ప్రజలు ఇంకా మరవలేదు. అయితే ప్రత్యర్థులు చేసే విమర్శలకు నేరుగా సమాధానం చెప్పలేకే రాచమల్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న ప్రచారం ఉంది.
గతంలో వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాచమల్లు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు రాచమల్లు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తమ్ముడు తప్పు చేస్తే జగన్ రాజీనామా చేస్తారా అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో సెటైర్లు వర్షం కురిసింది.
తీరా ఆ కేసులో అవినాష్ ముద్దాయి అయ్యారు. వెంటనే స్వరం మార్చిన రాచమల్లు..నేరం రుజువైతే రాజీనామా చేస్తామని చెప్పానంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. గతంలో వరుసగా రెండుసార్లు గెలిచిన రాచమల్లు ఈసారి ఓటమి పాలయ్యారు. ఓడినా అదే గర్వంతో మాట్లాడుతూ సెన్సేషనల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : జీవీఎల్ నరసింహారావు హడావుడి ఎందుకు తగ్గినట్లు?
గత ఐదేళ్లలో ప్రొద్దుటూరులో రాచమల్లు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలున్నాయి. ఆయన ఓటమికి ప్రధాన కారణం పవర్‌లో ఉన్నప్పుడు చేసిన అక్రమాలే అంటూ ప్రచారం ఉంది. అయితే ఓడిన తర్వాత కూడా తీరు మార్చుకోని రాచమల్లు తనపై వచ్చిన విమర్శలపై ఏ విచారణకైనా సిద్ధమంటూ సవాళ్లు విసురుతున్నారు. మున్సిపాలిటీలో జరిగిన అభివృధ్ది పనుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు..జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూమి కొనుగోళ్లలో కూడా రాచమల్లు చేతివాటం ప్రదర్శించారని అలిగేషన్స్ ఉన్నాయి.
అయితే తాను చేసిన అవకతవకలను బయటకు తీయలేరనే ధైర్యమో, తప్పు చేయలేదన్న నమ్మకమో తెలియదు కానీ ఏ ఎంక్వైరీకైనా సిద్ధమంటూ పదేపదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు రాచమల్లు. వైసీపీ అధికారంలో ఉన్న టైమ్‌లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ చేయాలంటూ..ఆయనే స్వయంగా వైజాగ్ వెళ్లి సీబీఐ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు.
పదవిలో ఉన్నంతకాలం విచారణకు సిద్ధం అంటూ నాయకులు వ్యాఖ్యానించడం కామన్. ఎందుకంటే వాళ్ల ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి. కానీ రాచమల్లు మాత్రం ప్రభుత్వం మారిన విషయాన్ని గుర్తించలేకపోతున్నారేమో తెలియదు కానీ..ఏ విచారణకైనా రెడీ అంటూ సవాళ్లు విసురుతున్నారు. వీటిని అధికార పార్టీ ఏ మాత్రం సీరియస్‌గా తీసుకున్నా విచారణలో రాచమల్లు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడటం ఖాయమంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
ఇదిలాగే కొనసాగితే మిగిలిన మాజీ ఎమ్మెల్యేలపైనా కూడా విచారణలు జరగొచ్చంటున్నారు. రాచమల్లు నోటి దూలతో తామెక్కడ ఇరుక్కుంటామోనన్న భయంలో మిగతా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రాచమల్లు మీడియాలో ఫోకస్ కావడం కోసం తన అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం తగదంటున్నారు. తీరు మార్చుకొని రాచమల్లుతో వైసీపీ నేతలకు వస్తున్న ఇబ్బందులేంటి.? ప్రొద్దూరులో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరి.
Also Read : ‘డిప్యూటీ సీఎం’ ప్రచారంపై నారా లోకేశ్ రియాక్షన్.. నా టార్గెట్ ఇదే.. అసలు విషయం రివీల్