వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలి- గౌడ సంఘాల నేతల డిమాండ్
అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్య వైఎస్ జగన్, వైసీపీ నాయకులు చిచ్చు పెడుతున్నారు. జగన్ కు దమ్ముంటే, గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే..

Mlc Duvvada Srinivas Row : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై గౌడ సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. తమను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీను కుటుంబసభ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ”దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి మీడియాతో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జాతి తక్కువ, కులం తక్కువ మనుషులం అని, అందవిహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించారు. దీన్ని గౌడ సంఘాల తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం.
గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్ మా గీత కులాన్ని అణగదొక్కారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశం లభిస్తున్న సమయంలో జాతులు, అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్య వైఎస్ జగన్, వైసీపీ నాయకులు చిచ్చు పెడుతున్నారు. జగన్ కు దమ్ముంటే, గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి బహిష్కరించాలి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలి” అని గౌడ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. తన భర్త మరో మహిళతో ఉంటున్నాడని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపిస్తున్నారు. తన భర్త తన దగ్గరికి వచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్వెల మాధురి తన భర్తను ట్రాప్ చేసి వలలో వేసుకుందని ఆమె ఆరోపించారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను దివ్వెల మాధురి ఖండించారు. దువ్వాడ శ్రీనును తాను ట్రాప్ చేయలేదని చెప్పారు. అది వారి కుటుంబ వ్యవహారం అని, తన భర్తతో ఏదైనా సమస్య ఉంటే వాళ్లు వాళ్లు పరిష్కరించుకోవాలని ఎదురుదాడికి దిగారు. దయచేసి తనను, తన పిల్లలను బజారుకు లాగొద్దని రిక్వెస్ట్ చేశారు.
మరోవైపు దువ్వాడ శ్రీనివాస్, అతడి తమ్ముడు దువ్వాడ శ్రీధర్ పై టెక్కలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్, అతడి భార్య వాణి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. భార్య వాణికి విడాకుల నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దువ్వాడ శ్రీను.
Also Read : ఇది ప్రమాదం కాదు.. చనిపోదామనే హైవే పైకి వచ్చా: మాధురి