GVMC Deputy Mayor: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. జనసేనకు పదవి.. అలిగిన టీడీపీ సభ్యులు..!

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హైడ్రామా నడిచింది. కూటమిలోని పార్టీల సర్దుబాటులో భాగంగా ఈ పదవిని జనసేనకు కేటాయించారు.

GVMC Deputy Mayor: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. జనసేనకు పదవి.. అలిగిన టీడీపీ సభ్యులు..!

Updated On : May 19, 2025 / 6:29 PM IST

GVMC Deputy Mayor: జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 56 మంది సభ్యులు (కార్పొరేటర్లు) అవసరం. 54 మంది మాత్రమే కౌన్సిల్‌కు హాజరయ్యారు. దీంతో ఈ ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. రేపు ఎన్నిక నిర్వహిస్తామని ఆర్డీవో మాధురి తెలిపారు.

కాగా, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హైడ్రామా నడిచింది. కూటమిలోని పార్టీల సర్దుబాటులో భాగంగా ఈ పదవిని జనసేనకు కేటాయించారు. అయితే డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి కేటాయించడంపై టీడీపీలోని పలువురు కార్పొరేటర్లకు నచ్చలేదు. వారు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కొందరు టీడీపీ వాళ్లు అలిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సర్ది చెప్పడంతో వారు తిరిగొచ్చారు. ఆ తర్వాత కోరం లేదని తేలింది. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది.

Also Read: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఆ నలుగురిని కలిపి విచారించాలి.. వారం రోజుల కస్టడీకి సిట్ పిటిషన్

గతంలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే జీవీఎంసీ మేయర్ హరి కుమారిపై కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మేయర్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే డిప్యూటీ మేయర్‌పైనా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ పదవిని జనసేనకి కేటాయించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.

అంతకుముందు డిప్యూటీ మేయర్ ఎన్నికలో చాలా హైడ్రామా నడిచింది. పదవి విషయంలో కూటమి పార్టీల కార్పొరేటర్లలో అసంతృప్తులు, అలకలు కనిపించాయి. విశాఖ డిప్యూటీ మేయర్ కూటమి అభ్యర్థిగా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డికి అవకాశం దక్కింది. జనసేనకు పదవి కట్టబెట్టడం పట్ల కొందరు టీడీపీ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకే ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అలిగి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లను బుజ్జగించారు. వారి బుజ్జగింపులు ఫలించాయి. కౌన్సిల్ సమావేశానికి టీడీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు.