సరిలేరు మీకెవ్వరు.. రైతన్నలే ఇంజనీర్లుగా మారారు, వేలాడే వంతెన నిర్మించారు

  • Published By: naveen ,Published On : September 13, 2020 / 04:49 PM IST
సరిలేరు మీకెవ్వరు.. రైతన్నలే ఇంజనీర్లుగా మారారు, వేలాడే వంతెన నిర్మించారు

Updated On : September 14, 2020 / 5:59 PM IST

సాగు చేయాలంటే కాలువ దాటాల్సిందే. నీటి ప్రవాహం స్లోగా ఉంటే పర్లేదు. కానీ వరద పొటెత్తితే.. సాగును వదులుకోవాల్సిందే. ఎవరో వస్తారు..ఏదో చేస్తారని రైతులంతా ఎదురు చూడలేదు. అంతా తామై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కూలిపోయిన బ్రిడ్జి స్థానంలోనే అందమైన హ్యాంగింగ్‌ వంతెన నిర్మించారు. రైతుల సంకల్పానికి సాకారమైన బ్రిడ్జి చూసి.. ఇప్పుడందరూ టేక్‌ ఏ బౌ అంటున్నారు.

2018లో వరదలకు కొట్టుకుపోయిన వంతెన:
ఇప్పుడైతే రైతుల కృష్టితో హ్యాంగింగ్‌ వంతెన అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి బ్యాగ్రౌండ్‌లోకి వెళ్తే.. వీరంపాలెం-త్యాజంపూడి గ్రామాల మధ్య ఎర్రకాలువపై వంతెన నిర్మించారు. అది 2018లో భారీ వరదలకు నిలవలేక కొట్టుకుపోయింది.

15వేల మందికి వంతెనే ఆధారం:
వీరంపాలెం-త్యాజంపూడి గ్రామాల్లో 15వేల జనాభా ఉంటుంది. వ్యవసాయం చేసే రైతుల రాకపోకలకు ఈ వంతెనే ఆధారం. నీటి ప్రవాహం తక్కువగా ఉంటే ఎర్రకాలువ దాటే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రవాహం ఎక్కువగా ఉంటే.. 10కిలోమీటర్ల దూరంలో మరో వంతెన దాటాల్సి ఉంటుంది. అదీ కుదరదంటే.. 25కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తేగానీ అవతలి వైపునకు వెళ్లడం కష్టమే.

వంతెన కోసం రెండున్నరేళ్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది:
రెండు గ్రామాల ప్రజలు దాదాపు 9వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వ్యవసాయ పనులకు, పాడి పశువుల మేతకు, పాలను కేంద్రానికి తరలించడం, నిత్యావసరాల కోసం కచ్చితంగా ఈ వంతెన దాటాల్సిందే. అయితే బ్రిడ్జి కూలిపోవడంతో స్తానిక రైతులకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి. దీంతో రెండున్నర సంవత్సరాలుగా వంతెన నిర్మాణం కోసం రైతులంతా అధికారుల చుట్టూ తిరిగారు. లీడర్లను కలిసి తమ కష్టాలను వివరించారు. కానీ ఏ ఒక్కరూ చొరవ చూపలేదు. కనీసం చేస్తామని హమీ కూడా ఇవ్వలేదు.

రైతుల ఆలోచనతో బ్రిడ్జి కల సాకారం:
దీంతో రైతులే స్వయంగా బ్రిడ్జి నిర్మాణానికి రెడీ అయ్యారు. వంతెన ఏర్పాటుతో కాలిబాట ఏర్పడింది. ఒకవేళ రైతులు సాహసించకుంటే..? బ్రిడ్జి నిర్మించకుంటే..? ప్రజలంతా ఎలా ఇబ్బందులు పడేవాళ్లో కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది టెన్‌ టీవీ. రైతుల ఆలోచనతో బ్రిడ్జి కల సాకారమైంది. అయినప్పటికీ ప్రభుత్వం కొత్తగా బ్రిడ్జి నిర్మించాలంటున్నారు స్థానికులు. సంక్షేమ పథకాలకు కోట్లు వెచ్చిస్తున్న సర్కార్.. తమ గ్రామం పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

రైతన్నలే ఇంజనీర్లుగా మారి కల సాకారం చేసుకున్న తీరు నిజంగా ఓ అద్భుతం. ప్రస్తుతానికైతే ఈ హ్యాంగింగ్ వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. కానీ వర్షాలొచ్చి వరదలు ఉధృతమైతే మళ్లీ కష్టాలు మొదలవడం ఖాయమనే ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విఙ్ఞప్తి చేస్తున్నారు.