Traffic Jam : దసరా పండుగకు ఊళ్లకు వెళ్లే నగర వాసులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ ..
Traffic Jam : దసరా పండుగ నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్తున్న నగరవాసులకు ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తోంది.

Traffic Jam
Traffic Jam : దసరా పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో నగర వాసులు పల్లెబాట పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా.. మరికొందరు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. అయితే, తమ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. నగరంలోనూ, నగర శివారల్లోని జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. దీంతో హయత్ నగర్‌లో విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఆ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు.
శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు రహదారులపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో నగరంలోనూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉప్పల్ చౌరస్తా వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.
ముఖ్యంగా నగరంలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి భారీగా మూసి వరద చేరడంతో బస్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్దకు ప్రయాణికులెవరూ రావొద్దని ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మూసీకి వరద పోటెత్తడంతో చాదర్‌ఘాట్ వద్ద బ్రిడ్జిపై నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచడంతో.. కోఠి, నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదర్‌ఘాట్ నుంచి మలక్ పేట్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్‌కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి, వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి టీజీఎస్ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని అధికారులు సూచించారు.