Anandayya Medicine: ఆనందయ్య కంటి మందుపై నేడు క్లారిటీ.. హైకోర్టు విచారణ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆనందయ్య మందుపై నిర్ణయం తీసుకుంది. కంటిలో చుక్కల మందు మినహా అన్నింటికీ అనుమతులు ఇచ్చేసింది. ఇవాళ(03 జూన్ 2021) ఆనందయ్య తయారు చేస్తున్న కంట్లో వేసే చుక్కల మందుపై క్లారిటీ రానుంది.

Highcourt Will Decide Today On Anandayya Medicine
HighCourt on Anandayya Medicine: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆనందయ్య మందుపై నిర్ణయం తీసుకుంది. కంటిలో చుక్కల మందు మినహా అన్నింటికీ అనుమతులు ఇచ్చేసింది. ఇవాళ(03 జూన్ 2021) ఆనందయ్య తయారు చేస్తున్న కంట్లో వేసే చుక్కల మందుపై క్లారిటీ రానుంది. కంట్లో మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఆనందయ్య వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ మందుపై నేడు కోర్టు విచారణ చెయ్యనుంది.
కంట్లో వేసే చుక్కల మందుకు మినహా.. అనందయ్య మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంటిలో వేసే మందుపై మాత్రం పూర్తిస్థాయి పరిశోధన రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. ఈ రిపోర్టులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండగా.. కంట్లో చుక్కల మందుపై తమకు రెండు వారాల సమయం కావాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది.
కె అనే కంట్లో వేసే చుక్కల మందు శాంపిల్ ఇవ్వకపోవడంతో అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, కంట్లో వేసే మందుపై ఇవాళ్టిలోగా నివేదికను తెప్పించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. ప్రభుత్వం, హైకోర్టు అనుమతివ్వడంతో మందు తయారీని వేగవంతం చేశారు ఆనందయ్య. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. మందు తయారు చేసే ప్రాంతాన్ని కూడా మరోచోటికి మార్చారు.
కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీలో ఆనందయ్య మందు తయారీ కానుంది. ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కృష్ణపట్నంలో మందు తయారీ చేస్తే భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. మందు తయారీ ప్రాంతాన్ని మార్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆనందయ్య మందుకు కావాల్సిన ముడి సరుకులు, వంట సామాగ్రిని పోర్టు ప్రాంతానికి తరలించారు.
మరోవైపు ఆన్‌లైన్‌లోనూ మందు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్లూడార్ట్ కొరియర్‌తో మాట్లాడి.. యాబై శాతం రాయితీతో సర్వీస్ ఇస్తామని బ్లూడార్ట్ చెప్పినట్లు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేచోట కాకుండా మూడు, నాలుగు కేంద్రాల ద్వారా మందు పంపిణీ చేయాలని చూస్తున్నారు.