ఊహించినట్టే జరిగింది.. ఇంద్రకీలాద్రిపై దొర్లిపడ్డ కొండరాళ్లు, రాళ్ల కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు, సీఎం జగన్ పర్యటనకు కాసేపటి ముందు..

hill rocks : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు దొర్లిపడ్డాయి. రాళ్ల కింద ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. బాధితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొండరాళ్లు పడే ప్రమాదం ఉందని టెన్ టీవీ ముందే హెచ్చరించింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కొండ ప్రాంతం పూర్తిగా నానింది. నాలుగు రోజులుగా కొండరాళ్లు విరిగిపడుతున్నాయి.
కాగా, సీఎం జగన్ కాసేపట్లో ఇంద్రకీలాద్రికి రానున్నారు.ఇదే సమయంలో కొండరాళ్లు విరిగిపడటం కలకలం రేపింది. అధికారులను ఆందోళనకు గురి చేసింది. గతంలోనూ చిన్న చిన్న బండరాళ్లు పడ్డ సందర్భాలున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో తాజాగా మరోసారి ఇంద్రకీలాద్రిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
కాగా, ఇంద్రకీలాద్రికి సీఎం జగన్ రానున్న సందర్భంగా ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. బుధవారం(అక్టోబర్ 21,2020) మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3:40 గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.