ప్రియురాలి మోజులో భార్యను హత్య చేసిన భర్త

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు, జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిసినా కొంత మంది వాటిపట్ల ఆకర్షితులవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రియురాలి మోజులో పడి తాళికట్టిన భార్యను హత్య చేశాడో కసాయి భర్త. ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్నాడు, కానీ పోలీసు విచారణలో దొరికిపోయాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రుకు చెందిన వీరవరపు అయ్యప్ప 2016 వ సంవత్సరంలో కొప్పర్రుకు చెందిన నాగవెంకట రమాదేవిని(24) వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. కొద్ది కాలంగా అయ్యప్ప వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి భార్య రమాదేవి ని వేధించటం మొదలెట్టాడు.
భార్యను అడ్డు తొలగించుకుని ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇలా ఉండగా జులై 31 వ తేదీ భార్య రమాదేవితో గొడవపడిన అయ్యప్ప ఆమెను పీకనులిమి చంపి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చీరతో ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు….. ఆమెను ఫ్యానుకు ఉరివేసి వేలాడ దీశాడు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న గణపవరం పోలీసులు వారం రోజుల్లో కేసును చేధించారు. భర్త అయ్యప్పను అదుపులోకి తీసుకుని విచారించటంతో చేసిన నేరం ఒప్పుకున్నాడు.