తెరపైకి కొత్త అభ్యర్థి : తిరుపతి ఉప ఎన్నిక బరిలో జగన్ పర్సనల్ ఫిజియో థెరపిస్ట్‌ గురుమూర్తి

  • Published By: bheemraj ,Published On : November 21, 2020 / 08:14 AM IST
తెరపైకి కొత్త అభ్యర్థి : తిరుపతి ఉప ఎన్నిక బరిలో జగన్ పర్సనల్ ఫిజియో థెరపిస్ట్‌ గురుమూర్తి

Updated On : November 21, 2020 / 8:31 AM IST

Tirupati Lok Sabha by – election : తిరుపతి లోక్‌సభ బరిలో దిగేది ఎవరు.. దివంగత నేత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారా.. లేక కొత్తవాళ్లు ఉంటారా.. ఈ ప్రశ్నలకు వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్‌ను మండలికి పంపాలని నిర్ణయించింది. అలాగే… ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తిని పార్లమెంట్‌ బరిలోకి దింపుతున్నారు.



తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా కొత్త వ్యక్తికి అవకాశమిస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్. త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరుగనుంది. బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంలో పోటీ చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ సిద్ధమయ్యాయి. అభ్యర్థులను కూడా ఖరారు చేసాయి. ఈ పరిస్థితుల్లో.. అధికార వైసీపీ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది.



గురుమూర్తి జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్‌గా ఉన్నారు. పాదయాత్ర నిర్వహించిన సమయంలో… యాత్ర పొడవునా జగన్ వెంట గురుమూర్తి ఉన్నారు. అన్ని రోజులూ ఫిజియో సేవలందించారు. కాళ్ల నొప్పుల నివారణకు చిట్కాలు చెప్పడమే కాకుండా… బసకు చేరుకోగానే.. జగన్ పాదాలు, కాళ్లకు సంబంధించి అన్ని సంరక్షణ చర్యలు తీసుకునే వారు. అప్పటి నుంచి జగన్‌కు సన్నిహితంగా మారిన గురుమూర్తి తిరుపతి ఉప ఎన్నికలో బరిలోకి దిగనున్నారు.



కరోనాతో చనిపోయిన తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వైసీపీ ప్రకటించింది. బల్లి దుర్గా ప్రసాదరావు భార్య, కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి జగన్‌ను కలిశారు. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని అధినేత హామీ ఇచ్చారు. శాసన మండలిలో మొదట ఏ స్థానం ఖాళీ అయితే.. ఆ స్థానంలో కళ్యాణ్ చక్రవర్తిని ఎమ్మెల్సీని చేస్తామన్నారు.



తిరుపతిలో వైసీపీ తరపున ఎవరు పోటీచేసినా అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్. వైసీపీ అభ్యర్ధి తరపున తమ కుటుంబమంతా ప్రచారం చేస్తుందని తెలిపారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను పార్టీలో అసలు ఏ పదవీ కోరుకోవడం లేదన్నారు కళ్యాణ్.



గురుమూర్తిని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఆయన చిత్తశుద్ధి అంటున్నారు పార్టీ నేతలు. బాపట్లలో సామాన్య గ్రామస్థాయి నేత కూడా కాని నందిగం సురేష్‌లాగే.. గురుమూర్తిని ఎంపిక చేశారని చెబుతున్నారు. ఇక.. అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్న జగన్… అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు.