సత్యకుమార్ ధర్మవరంలో పోటీచేయడమా?: చిలకం మధుసూదన్ రెడ్డి విస్మయం

సత్యకుమార్ ఇక్కడి రావడం మంచి పరిణామమా, కాదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆయనే వస్తున్నారా లేక ఎవరైనా పంపించారా అనేది నాకు తెలియదు.

సత్యకుమార్ ధర్మవరంలో పోటీచేయడమా?: చిలకం మధుసూదన్ రెడ్డి విస్మయం

Chilakam Madhusudhan Reddy: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నాయకుడు సత్యకుమార్ యాదవ్‌ను ఖరారు చేయడంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నేత చిలకం మధుసూదన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సత్యకుమార్ చాలా పెద్ద నాయకుడని, అలాంటి వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగడంతో తన మైండ్ బ్లాకయిందన్నారు. ధర్మవరం బీజేపీ అభ్యర్ధిగా ఎంపికైన సత్యకుమార్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయనను కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు.

”సత్యకుమార్ చాలా పెద్ద నాయకుడు. యూపీ రాష్ట్రానికి ఇంచార్జిగా పనిచేశారు. ఆయనతో వ్యక్తిగత పరిచయం లేనప్పటికీ.. ఆయన గురించి బాగా తెలుసు. చాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తి. దేశానికి ప్రాతినిథ్యం వహించాల్సిన నాయకుడు. అలాంటి స్థాయి ఉన్న సత్యకుమార్ ఇక్కడి రావడం మంచి పరిణామమా, కాదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆయనే వస్తున్నారా లేక ఎవరైనా పంపించారా అనేది నాకు తెలియదు. అంతస్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడ పోటీ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఆయనతో స్వయంగా మాట్లాడతా, ధర్మవరం పరిస్థితుల గురించి వివరిస్తా. మిత్రపక్ష అభ్యర్థిగా ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాన”ని మధుసూదన్ రెడ్డి అన్నారు.

Also Read: టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! ఆ రెండు సీట్లకు అభ్యర్థుల ప్రకటన

సేవ్ ధర్మవరం కార్యక్రమంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి భరోసా కల్పించానని, అవన్నీ నెరవేర్చలేకపోతున్నందుకు ధర్మవరం ప్రజలకు చిలకం మధుసూదన్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ధర్మవరం ప్రజలకు అండగా నిలబడతానని వాగ్దానం చేశానని, కానీ హామీని నిలబెట్టుకునే అవకాశం తనకు రాలేదన్నారు. ధర్మవరం వివాదస్పద నియోజకవర్గమని, ఇక్కడ కొందరి స్వార్థ రాజకీయాలకు ధర్మవరం ప్రజలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించడంతో తమ కేడర్ చాలా నిరుత్సాహానికి గురయ్యారని, వారితో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.