జగన్ కు జై : పవన్ కళ్యాణ్ కు జనసేన ఎమ్మెల్యే మరో షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరో షాక్ ఇచ్చారు. మరో విషయంలో సీఎం జగన్ కు జై కొట్టారు రాపాక. జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన శాసన మండలి రద్దు నిర్ణయానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు తెలిపారు. సోమవారం(జనవరి 27,2020) ఏపీ శాసనసభలో మండలి రద్దు తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాపాక.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన మండలి రద్దు తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తీర్మానానికి అనుకూలంగా మాట్లాడారు.
అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న సదుద్దేశంతో సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాంటి వికేంద్రీకరణ బిల్లును మండలి అడ్డుకోవడం బాధాకరమన్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియం బిల్లును సైతం మండలిలో తిరస్కరించారని చెప్పారు. ఇలాంటి సభ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగడం సమంజసం కాదన్నారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని రాపాక వరప్రసాద్ తేల్చి చెప్పారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ కార్యక్రమాలను చేపట్టడం వల్లే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిని సాధించగలుగుతుందని చెప్పారు. అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటు బిల్లును కూడా తీసుకొచ్చిన సీఎం జగన్‌ను తాను అభినందిస్తున్నానని అన్నారు.
సీఎం జగన్ పాలనపై ప్రశంసలు:
ఇంగ్లీష్ మీడియం బిల్లుకి అసెంబ్లీలో అనుకూలంగా వ్యవహరించిన టీడీపీ, మండలిలో వ్యతిరేకించిందని రాపాక చెప్పారు. సీఎం జగన్ చెప్పినట్లు ఈ సభలో అందరూ బాగా చదువుకున్నవారే ఉన్నారని, ఇక మరో సభ ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు రాపాక. మాల, మాదిగలను విడదీసింది.. చంద్రబాబే అన్నారు. చంద్రబాబు ఎంతసేపటికీ బిట్రిష్ సంప్రదాయం ప్రకారం విభజించి, పాలిస్తారని విమర్శించారు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తున్నారని ఎమ్మెల్యే రాపాక చెప్పారు. రాష్ట్రంలో సీఎం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డ్రైన్స్, రోడ్లన్నీ బాగు చేస్తున్నారని కితాబిచ్చారు.
మండలి అవసరమే లేదు:
ప్రస్తుత శాసనసభలో మేధావులు, ఉన్నత విద్యావంతులు, రాజకీయ ఉద్దండులు ఉన్నారన్న రాపాక.. అలాంటప్పుడు పెద్దల సభ పేరుతో శాసన మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇంతమంది చదువుకున్న వారు సభ్యులుగా ఉన్న శాసనసభకు పైన మరో సభ ఉండాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. ఇంతమంది సమర్థులున్న సభలో తీసుకున్న నిర్ణయాన్ని, ఆమోదించిన బిల్లును శాసన మండలి తిరస్కరించడం కరెక్ట్ కాదన్నారు.
వైసీపీలోకి రాపాక..?:
మండలి రద్దు తీర్మానానికి మద్దతివ్వడమే కాదు.. తీర్మానానికి అనుకూలంగా రాపాక వరప్రసాద్ ఓటు కూడా వేశారు. దీంతో జనసేనాని పవన్ కు మరో షాక్ ఇచ్చినట్టు అయ్యింది. ఇప్పటికే పలు అంశాల్లో జగన్ ప్రభుత్వం నిర్ణయాలను పవన్ వ్యతిరేకించారు. కానీ జనసేన ఎమ్మెల్యే మాత్రం.. పవన్, పార్టీ అభిప్రాయాలకు, అభిమతాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఓపెన్ గానే ప్రభుత్వ నిర్ణయాలను సపోర్ట్ చేస్తున్నారు. రాపాక వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. దానికి ఊతమిచ్చేలా రాపాక తీర ఉందనే చర్చ నడుస్తోంది. రాపాక తీరు జనసేన శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.