Jayaprakash Narayan: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు.. 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు..
చదువు ఎందుకింత అధ్వాన్నంగా ఉంది. ప్రతిభ వికసించకుండా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందా?
Jayaprakash Narayan: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై ఆయన స్పందించారు. ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు.
”కొన్ని వందల ఏళ్ల పాటు కుల వ్యవస్థ పుట్టుకతోనే మనిషిని ఎక్కువ తక్కువ చేసింది. మీరంతా సమానం అయిపోయారు, అందరూ కలిసి రండి, ఓటు వేయండి అంటే.. చాలదు. ఇదిగో మీ బాధను గుర్తించాం. అన్యాయాన్ని గమనించాం. దానికి ఏర్పాట్లు చేస్తాం. టైమ్ పడుతుంది. కానీ, ఈలోగా అని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చారు. అంబేద్కర్ అందుకు పదేళ్ల వ్యవధి మాత్రమే పెట్టారు. ఎందుకు అలా పెట్టారు. అంబేద్కర్ చిత్తశుద్ధిని మనం కాదనలేం.
పదేళ్లలో ప్రతి బిడ్డ ఎదిగే అవకాశాన్ని (మంచి విద్య ద్వారా, చట్టబద్ధ పాలన), అందరూ సమానంగా ఉండే వ్యవస్థను రాజ్యం ఏర్పాటు చేస్తుందని ఆయన నమ్మారు. కానీ, ఇప్పటి పాలకులు అది మర్చిపోయారు. రిజర్వేషన్లు శాశ్వతంగా కొనసాగించి, అదే పరిష్కారంగా నటించి, ఆ బతుకులు మార్చకుండా, విద్య నైపుణ్యం రాకుండా, సంపాదించే శక్తి రాకుండా, ఆత్మగౌరవం పెరగకుండా.. పాలకులు ఏం చేసినా అది డ్రామానే. ఆ బతుకులు అలానే ఉంటాయి. కులాల మధ్య చిచ్చు పెట్టి, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చేసి డ్రామాలాడుతున్నాం. రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన జీవితాలు బాగుపడ్డాయా? ఎందుకు బాగుపడలేదు? ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? చదువు ఎందుకింత అధ్వాన్నంగా ఉంది. ప్రతిభ వికసించకుండా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందా? మీ రిజర్వేషన్లతో వారి జీవితాలు బాగుపడుతున్నాయా? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? నా పోరాటం ఏంటంటే.. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి.. పుట్టుకతో నిమిత్తం లేకుండా, ఏ తల్లి గర్భాన పుట్టింది అనే దాని నిమిత్తం లేకుండా.. ఎదిగే అవకాశాలు కావాలి. అవకాశాలు ఇవ్వని సమాజం ఈ మాటలు మాట్లాడటం ఆత్మవంచన, పరులను దగా చేయడమే” అని జయప్రకాశ్ నారాయణ అన్నారు.
Also Read: మూడేళ్లు ఉంటారో, 3 నెలలే ఉంటారో..! ఆయన సీటుకే గ్యారెంటీ లేదు..!- సీఎం రేవంత్ పై కేటీఆర్ పైర్
