Kakani Govardhan Reddy: వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు.

Kakani Govardhan Reddy
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్కారు తీరును విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు.
జిల్లా ఎస్పీ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాకాణి అన్నారు. వెంకటాచలం మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్య యాదవ్ పై ఓ మహిళ నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఆ కేసులో తన వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు ఫిర్యాదులో రాయించారని అన్నారు.
రిమాండ్ రిపోర్ట్ లో వివరాలు సరిగా లేవని న్యాయమూర్తి పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. దీంతో మెటీరియల్ ఎవిడెన్స్ ఉందని చెబుతూ మళ్లీ ఆ రిమాండ్ రిపోర్ట్ ను మార్చి తీసుకెళ్లారని ఆరోపించారు. కోవూరులో స్టాంపు వెండర్ లోక్ నాథ్ సింగ్ నుంచి కొనుగోలు చేశారని అన్నారు. ఆయన పాత తేదీని వేసి స్టాంప్స్ ను ఆ మహిళకు విక్రయించారని తెలిపారు. తేదీలు మార్చినట్లు కోవూరు సబ్ రిజిస్ట్రార్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరాలు ఉన్నాయని చెప్పారు.
న్యాయవ్యవస్థను పోలీసులు తప్పదోవ పట్టించారని కాకాణి అన్నారు. జిల్లా ఎస్పీ విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలానికి రాకుండానే నివేదిక ఇచ్చారని తెలిపారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు భయపడరని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.