Karnati Rambabu: జనసేన నేత పోతిన మహేశ్‌కు దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు 2 రోజుల డెడ్‌లైన్
Karnati Rambabu: నాలుక చీరేస్తాం అంటూ కర్నాటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

Karnati Rambabu Vs Potina mahesh
Karnati Rambabu: విజయవాడ దుర్గగుడి (Durga Temple) ఛైర్మన్ కర్నాటి రాంబాబు (Karnati Rambabu), జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ (Potina mahesh) మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా, కర్నాటి రాంబాబుపై పోతిన మహేశ్ పలు ఆరోపణలు చేశారు. దీనిపై కర్నాటి రాంబాబు స్పందిస్తూ… “పోతిన మహేశ్ నాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం. నాకు ఏ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉందో మహేశ్ చూపించాలి. నాపై కేసులు ఉన్నా నిరూపించాలి” అని అన్నారు.
“నాపై ఒక్క 420 కేసు ఉన్నా నేను నా ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తా. రెండు రోజుల్లో నాపై చేసిన వ్యాఖ్యలు నిరూపించాలి.. లేకుంటే మహేశ్ పై పరువు నష్టం దావా వేస్తా. పోతిన మహేశ్ ఒక 420.. పి.నైనవరంలో పంచాయతీ భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తే ఎమ్మార్వో ఆ భూమిని స్వాధీనం చేసుకుని మహేశ్, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీకి డబ్బులు ఎగ్గొడితే వేలానికి పిలిచింది వాస్తవం కాదా? మాపై ఆరోపణలు చేస్తే మహేశ్ పెద్దవాడు అవుతాడని భ్రమలో ఉన్నాడు. మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. దుర్గగుడి వ్యవహారంలో పోతిన మహేశ్ కు ఏం సంబంధం?
నిజాయితీ ముసుగులో జరుగుతున్న దాన్ని బయటకు తీస్తే నీకెందుకు అంత ఉలికిపాటు? గుడిలో ఉన్న అధికారులను బ్లాక్ మెయిల్ చేసి పనులు చేపించుకోవడం కాదు. అమ్మవారి ఆలయం కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతీస్తే నాలుక చీరేస్తాం. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసి నా పరువుకు భంగం కలిగిస్తున్నారు .. నాపై ఆరోపణలు నిరూపించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా.
దుర్గాఘాట్ లో పోతిన మహేశ్ మామూళ్లు వసూలు చేస్తున్నారని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై అసలు విషయాలను బయటకు తీసుకొస్తాం. నగేశ్, పోతిన మహేశ్ కాల్ డేటా పరిశీలించాలని ఏసీబీ అధికారులను కోరుతున్నా.. అప్పుడే వెనుక ఎవరెవరు ఉన్నారో అన్నీ బయటపడతాయి. ఈవో బదిలీపై మేము ఎప్పుడు మాట్లాడాం? ఈవో బదిలీకి, మాకు ఏంటి సంబంధం? మాకు పనిచేసే ఈవోలు కావాలి. పోతిన మహేశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని కర్నాటి రాంబాబు డిమాండ్ చేశారు.
పోతిన మహేశ్ ఏమన్నారు?
అంతకుముందు పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పినట్లే కర్నాటి రాంబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. రౌడీ షీటరైన కర్నాటి రాంబాబు సైతం అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ గురించి మాట్లాడటం ఏంటని అన్నారు. జగన్ కు ఈవోపై ఎందుకు ఫిర్యాదు చేశారని అడిగారు. ఈవోని బదిలీ చేయించాలని కుట్ర పన్నారని చెప్పారు. కొత్త ఈవోని నియమించి నిధులు కొట్టేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు.
మరోవైపు, కర్నాటి రాంబాబు, విజయవాడ దుర్గగుడి ఈవో మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. ఇటీవల దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సూపరింటెండెంట్ నగేశ్ ఆస్తులపై ఏసీబీ సోదాలు చేసిన నేపథ్యంలో దుర్గగుడి ఛైర్మన్, ఈవో పరస్పర ఆరోపణలు చేసుకోవడం కలకలం రేపింది.