ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి వారి భార్యలతోనే వెళ్లి పూజలు చేస్తున్నారా? కొడాలి నాని

తిరుమల డిక్లరేషన్ అంశంలో తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను కేబినెట్ నుంచి తొలగించాలని, అలాగే సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సోమువీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయ్యాకే ఆలయాలపై దాడులు పెరిగాయి:
‘‘పది మందిని వెంటబెట్టుకెళ్లి అమిత్‌షా, కిషన్‌రెడ్డిని తొలగించాలంటే తొలగిస్తారా? రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదం. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి బీజేపీకి ఉందా? ప్రధాని మోడీని తన సతీమణిని తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి. మోడీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? ఎవరి పార్టీ విధానాలు వారికి ఉంటాయి.
సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆలయాలపై దాడులు జరిగాయంటే ఆయన్ను తొలగిస్తారా? నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలనే దానిపై బీజేపీ ఆలోచించుకోవాలి. అంతేకానీ మా పార్టీలో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీసేయాలనే విషయాలను జగన్‌కు బీజేపీ నేతలు చెప్పేదేంటి? ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిది’’ అంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
శ్రీవారి దర్శనానికి వచ్చిన కొడాలి నాని, బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో మోడీ బజారున పడపడుతున్నారని విమర్శించారు. ముందు నరేంద్ర మోడీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు.
డిక్లరేషన్ తొలగింపు నా వ్యక్తిగత అభిప్రాయం:
శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన కొడాలి నాని, స్వామివారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, డిక్లరేషన్‌పై చర్చ జరగాలన్నారు. అసలు ఈ నిబంధన ఎప్పుడు నుంచి అమలులో ఉందో బహిర్గతం చెయ్యాలని… సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంధం లేదన్నారు. హిందూ దేవాలయానికి వచ్చినప్పుడు హిందువులా… చర్చిలో క్రైస్తవుడిలా… మసీదులో సమయంలో నవాబులా ఉంటారని తెలిపాడు.
బీజేపీ నేతల వల్ల ప్రధాని భార్య గురించి మాట్లాడాల్సి వస్తోంది:
వేంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. శ్రీవారి దయవల్లే జగన్ సీయం అయ్యారన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు టీటీడీనే సీఎంను ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలని ప్రశ్నించారు. కాగా, తిరుమలలో డిక్లరేషన్ తొలగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని మంత్రి స్పష్టం చేశారు. దానిపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు.
డిక్లరేషన్ ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారనే అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వెంకన్నను కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ నాటకాలు ఆపాలన్నారు. బీజేపీ నాయకుల వల్ల మోడీ భార్య గురించి మాట్లాడాల్సి వస్తోందన్నారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి భార్యలతోనే వెళ్లి పూజలు చేస్తున్నారా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. భార్యభర్తలు కలిసి పట్టువస్త్రాలు ఇవ్వాలని ఏ శాస్త్రంలో ఉందో చెప్పాలన్నారు.