Kuppam Incident: మహిళను చెట్టుకు కట్టేసి దాడి.. మంత్రి లోకేశ్ సీరియస్.. కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్
ఈ ఘటనకు బాధ్యులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు లోకేశ్. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని..

Kuppam Incident: చిత్తూరు జిల్లా కుప్పం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పు తీర్చలేదని మహిళను వడ్డీ వ్యాపారి చెట్టుకు కట్టేసి కొట్టడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. కుప్పం మండలం నారాయణపురంలో జరిగిన ఈ దారుణంపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
అప్పు తీర్చలేదని మహిళ పట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు లోకేశ్. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
కుప్పం ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప దగ్గర 85వేలు అప్పు తీసుకుని పారిపోయాడు. నిన్న తిమ్మరాయప్ప భార్య ఊరికి రావడంతో మునికన్నప్ప, అతడి కుటుంబసభ్యులు ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆమెను దూషిస్తూ దారుణంగా కొట్టారు. మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.