కర్నూల్ బస్సు ప్రమాదం.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు.. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలిసింది.. బైకర్ చివరి వీడియో వైరల్..
Kurnool bus accident : చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి శివశంకర్, ఎర్రిస్వామి కిందపడ్డారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోగా.. రోడ్డు మీద చెరో వైపు వారు పడిపోయారు.
Kurnool bus accident
Kurnool Bus Tragedy : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు -చెట్లమల్లాపురం మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తరువాత బస్సుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించి తగలబడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 19మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ప్రమాదంపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.. ఈ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఘోర ప్రమాదానికి కారణం ఓ బైక్ అని స్పష్టమవుతోంది. దీంతో ఆ బైక్ నడిపిన వ్యక్తి ఎవరు.. అతని పేరు ఏమిటి.? బస్సు బైక్‌ను ఢీకొట్టిందా.. బైక్ వెళ్లి బస్సును ఢీకొట్టిందా అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, బస్సు ఢీకొట్టిన బైక్ నడిపిన వ్యక్తికి సంబంధించిన సీసీ పుటేజీలు వెలుగులోకి వచ్చాయి.
ప్రమాదానికి ముందు బైక్ నడిపిన వ్యక్తితోపాటు మరో వ్యక్తి పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకుంటున్నట్లు కనిపించింది. అయితే ఆ సమయంలో వారు మద్యం సేవించినట్లు ఉంది. ఈ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. బైక్ పైనుంచి కిందపడి మరణించింది కర్నూల్ సిటీలోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తి శివశంకర్ అని గుర్తించారు.
శివశంకర్‌కు శుక్రవారం రోజు పెళ్లి చూపులు. అయితే, అర్ధరాత్రి సమయంలో తన పల్సర్ బైక్ పై చిన్నటేకూరు ఎందుకు వెళ్లాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామిగా గుర్తించారు. ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. బైక్‌ను వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టలేదని వెల్లడైంది. అర్ధరాత్రి సమయంలో వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.
చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి వారిద్దరూ కిందపడ్డారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోగా.. రోడ్డు మీద చెరో వైపు శంకర్, ఎర్రిస్వామి పడిపోయారు. డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. అతను స్పాట్‌లో మృతి చెందాడు. మరో వ్యక్తి ఎర్రి స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత వేగంగా దూసుకొచ్చిన వీ కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడిఉన్న బైక్ పైనుంచి దూసుకెళ్లింది.
దీంతో సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు వ్యాపించి బస్సు దగ్దమైంది. బస్సు ప్రమాదంతో ఎర్రిస్వామి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, సీపీ ఫుటేజ్, సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు ఎర్రిస్వామిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు.
