తిరుమలలో చలి చంపుతోంది, భక్తులు గజ గజ

  • Published By: madhu ,Published On : November 13, 2020 / 08:51 AM IST
తిరుమలలో చలి చంపుతోంది, భక్తులు గజ గజ

Updated On : November 13, 2020 / 9:21 AM IST

Lowest Temperatures Recorded In Tirumala : తిరుమలలో చలి చంపుతోంది. తెలుగురాష్ట్రాల్లో క్రమంగా చలిపంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుమలలో చలి ప్రభావం మరింత పెరిగింది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. భక్తజనం గజగజ వణుకుతూ.. గదులకే పరిమితమవుతున్నారు. చలి తీవ్రత కారణంగా శ్రీవారి ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.



నవంబర్ మాసం ప్రారంభమైన నాటి నుంచి తిరుమలలో చలి ప్రభావం మరింత పెరిగింది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వస్తున్న భక్తులు చలికి గజగజ వణికిపోతున్నారు. చలిగాలులకు తాళలేక భక్తులు గదులకే పరిమితమవుతున్నారు. తిరుమల ఏడుకొండలు ఊటీ, కొడైకెనాల్ లాంటి అతి శీతల ప్రాంతాలను తలపించేలా రాత్రుల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు 24 డిగ్రీలు లోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా సాయంత్రం 5 గంటలకు 19 డిగ్రీలకు పడిపోతోంది.



ఇక రాత్రి వేళ్లోల్లో మరింతగా 14 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తిరుమల ఘాట్ రోడ్డులో టూవీలర్ ప్రయాణీకులు చలికి వణికి పోతున్నారు. ఘాట్‌రోడ్లలో పొగమంచు అలుముకోవడంతో రహదారి సరిగా కనిపించక ఇబ్బందులు పడ్డారు. ఇక తిరుమలకు వచ్చిన భక్తులు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి స్వెటర్లు, శాలువలను కప్పుకోవాల్సి వస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.



మొత్తం మీద తిరుమలలో చలి తీవ్రత పెరగడంతో ఉలన్ స్వెట్టర్లు, జర్కిన్‌లు, శాలువాల వ్యాపారం జోరుగా సాగుతోంది. భక్తులు వాటిని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కొంతమంది భక్తులు చన్నీటి స్నానాలకు భయపడి.. టీటీడీ ఏర్పాటుచేసిన కామన్ గీజర్‌లలో వేడినీటిని పట్టుకెళ్తున్నారు. ఇక వేకువజామున వీఐపీ, సర్వదర్శనాలకు వెళ్లే భక్తులు చలికి ఇబ్బంది పడుతున్నారు.