క్యాబినెట్ రేస్.. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలైన ఈ ఇద్దరిలోనూ మంత్రి పదవిపై ఆశలు
మహానాడు వేదికగా ఏకంగా సీఎం చంద్రబాబు మాధవిరెడ్డిని పొగడటంతో ఆమెకు బెర్త్ పక్కా అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. క్యాబినెట్ షఫ్లింగ్ ఎప్పుడో..ఎంతమందిని తప్పించి..మరెంతమంది కొత్తవారిని తీసుకుంటారో తెలియదు కానీ..మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకు బెర్త్ పక్కా అంటూ ఊహల్లో తెలియాడుతున్నారు ఆశావహులు. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఇద్దరి పేర్లు క్యాబినెట్ రేసులో సౌండ్ రీసౌండ్ చేస్తున్నాయ్. మొదటి ప్రయత్నంలోనే గెలిచి ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒకరు అయితే..మరొకరేమో పార్టీకి వీర విధేయుడు పుట్టా సుధాకర్‌యాదవ్.
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప అంటే విడిపోయిన నాలుగు జిల్లాలు ఉమ్మడి రెండు జిల్లాలకు కలిపి కొత్తగా ఎమ్మెల్యే అయిన రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మొదటి విడతలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాలుగు జిల్లాలకు కలిపి ఒకరే మంత్రిగా ఉండటాన్ని కొంతమంది పెద్దలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో విస్తరణలో మరొకరికి అవకాశం ఇస్తామన్నారని టాక్. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు మంత్రివర్గ విస్తరణలో ప్రముఖంగా వినిపిస్తోంది.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన పుట్టా..మైదుకూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయ్. శ్రీవారి సేవతో పాటు సమాజసేవ చేసి చంద్రబాబుకు నమ్మినబంటుల ఉంటున్నారు. పైగా ఉమ్మడి కడప జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఆర్థికంగా, సామాజికంగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కావడం పుట్టా సుధాకర్ యాదవ్‌కు కలిసి వచ్చే అంశాలు.
వైసీపీతో ఢీ అంటే ఢీ
ఇక మొదటి ప్రయత్నంలోనే కడప ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి. మైనార్టీల కంచుకోటైన కడపలో గెలిచి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్ పదవిని కూడా దక్కించుకున్నారు. కడప నగరంలో ఓవైపు అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో పాటు..ప్రత్యర్థి వైసీపీతో ఢీ అంటే ఢీ అంటుండటం మాధవిరెడ్డికి కలిసొచ్చే అంశాలు. ఆమె ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే కావడం..జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, మిగతా నేతల్లో సీనియర్లు ఎక్కువ. ఇది మాధవి రెడ్డికి కాస్త ఇబ్బందిగా మారొచ్చు. అయినా మంత్రి పదవి రేసులో కడప శివంగిగా పిలవబడే మాధవి రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
మాధవిరెడ్డి భర్త కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆర్థికంగా బలవంతుడు కావడంతో పాటు నేరుగా చంద్రబాబు లోకేశ్‌తో టచ్‌లో ఉంటూ పొలిట్ బ్యూరో వ్యవహారాలు చక్కబెడుతుంటారు. మంత్రి పదవి వస్తే జిల్లాపై పట్టు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే భావనతో భార్యకు మంత్రి పదవి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కడప మహానాడు వేదికగా శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగం భార్యకు మంత్రి పదవి కోసమే అంటూ లోకల్ పార్టీలో టాక్.
ప్రభుత్వ ఏర్పాటు అప్పుడే మాధవిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనుకున్నారు. అప్పుడు కుదరలేదు. మహానాడు వేదికగా ఏకంగా సీఎం చంద్రబాబు మాధవిరెడ్డిని పొగడటంతో ఆమెకు బెర్త్ పక్కా అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే మంత్రిగా అవకాశం ఇవ్వాలనుకుంటే బీసీ కోటా లేకపోతే మహిళా కోటా.. ఇలా చూస్తే వీరిద్దరిలో ఒకరికి అవకాశం తప్పనిసరి. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో మాధవిరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌లలో ఎవరికి అమాత్య యోగం వరించబోతుందో చూడాలి మరి.