Living Grave : ప్రకాశం జిల్లాలో కలకలం.. సజీవ సమాధికి వ్యక్తి యత్నం… ఎందుకిలా చేశాడంటే..

ఈ ఆలయం ముందు పెద్ద గొయ్యి తీశాడు. వారం రోజుల నుంచి ఆ గొయ్యిలోకి దిగుతున్నాడు.

Living Grave : ప్రకాశం జిల్లాలో కలకలం.. సజీవ సమాధికి వ్యక్తి యత్నం… ఎందుకిలా చేశాడంటే..

Updated On : March 31, 2025 / 9:53 PM IST

Living Grave : ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అందరిని షాక్ కి గురి చేసింది. ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. విఠలాపురం మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కైపు కోటిరెడ్డి 12ఏళ్ల క్రితం ఊరి శివారులో తన పొలంలో భూదేవి ఆలయం నిర్మించాడు.

ఈ ఆలయం ముందు పెద్ద గొయ్యి తీశాడు. వారం రోజుల నుంచి ఆ గొయ్యిలోకి దిగుతున్నాడు. పైన రేకు కప్పుకుని ధ్యానం చేస్తున్నాడు. ఉగాది రోజున సజీవ సమాధా కావాలని నిర్ణయించుకున్నాడు. కోటిరెడ్డి తన కుమారుడితో కలిసి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం సమాధిలా ఏర్పాటు చేసిన గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అతడి కుమారుడు ఆ గొయ్యిపై పెద్ద రేకు ఉంచి దానిపై మట్టి పోసి పూడ్చి వేశాడు.

Also Read : మలుపులు తిరుగుతున్న పాస్టర్ ప్రవీణ్ కేసు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్ వీడియో

విషయాన్ని తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి, మరికొందరు అక్కడికి చేరుకున్నారు. వెంటనే గొయ్యి నుంచి బయటకు రావాలని కోరారు. బయటకు వచ్చేందుకు నిరాకరించిన కోటిరెడ్డి.. తన ధ్యానానికి ఎవరూ భంగం కలిగించొద్దని అన్నాడు. సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు అక్కడకి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కోటిరెడ్డిని గొయ్యి నుంచి బయటకు తీశారు.

పోలీసులు వెళ్లిపోయిన తర్వాత కోటిరెడ్డి మళ్లీ అదే గొయ్యిలోకి దిగి ధ్యానం చేశాడు. కుటుంబసభ్యులు, స్థానిక పెద్దలు వచ్చి బయటకు రావాలని కోరడంతో కోటిరెడ్డి ఇంటికి వచ్చాడు. ప్రపంచ శాంతి కోసమే తాను సజీవ సమాధి అవుతున్నానని కోటిరెడ్డి చెప్పాడు.

Also Read : బావిలో 17 కిలోల బంగారం..! కర్నాటక దావణగెరెలో గోల్డ్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..

”అమ్మవారు ఏం చెబితే అది నేను చేస్తాను. అమ్మవారు చెప్పిందనే నా సొంత డబ్బుతో రెండు గుళ్లు కట్టాను. ప్రపంచం అంతా సుఖంగా, సంతోషంగా ఉండాలని.. కులాలు మతాలు లేకుండా ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని అమ్మవారి ముందు దీక్ష చేస్తున్నా. పోలీసులు వచ్చి నా దీక్షను భగ్నం చేశారు” అని కోటిరెడ్డి చెప్పాడు.