దారుణం : భార్యను తల నరికి చంపిన భర్త

  • Published By: murthy ,Published On : November 21, 2020 / 02:29 PM IST
దారుణం : భార్యను తల నరికి చంపిన భర్త

Updated On : November 21, 2020 / 4:03 PM IST

Man brutally murdered his wife : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కిరాతకానికి పాల్పడ్డాడు. చేపల వేటకని భార్యని తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసిన ఘోర దృశ్యం జిల్లాలో కలకలం రేపింది. రేపల్లె సమీపంలోని సముద్ర తీరం మడ అడవుల్లో ఈ దారుణ ఘటన జరిగింది.

నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు, మరియమ్మ(40) దంపతులు. చేపల పడుతూ జీవనం సాగిస్తున్నారు.భర్త నాగరాజు మద్యానికి బానిస కావడంతో భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు.



ప్రతిరోజు మాదిరిగానే భార్యను శుక్రవారం చేపల వేటకు తీసుకెళ్లి అమానుషంగా చంపేశాడు. భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు. మొండెం నుంచి తలను వేరుచేసి పడేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేశాడు.

అమ్మ ఎక్కడని కొడుకు అడిగినా సమాధానం చెప్పలేదు. స్థానికుల  సాయంతో కొడుకు బోట్లలో చేపల వేటకు వెళ్లే మడ అడవుల వద్ద గాలించడంతో మరియమ్మ మృతదేహం కనిపించింది. తల, మొండెం వేరుచేసిన మృతదేహాన్ని చూసి షాకయ్యారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.