నిన్న అష్టాచెమ్మా, నేడు పేకాట.. పేకాట ఆడి 17మందికి కరోనా అంటించాడు

నిన్న అష్టాచెమ్మా, నేడు పేకాట.. పేకాట ఆడి 17మందికి కరోనా అంటించాడు

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విజయవాడలో ఒకే వ్యక్తి ద్వారా 17 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలుసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంకలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలోని 17 మందికి ఒకే వ్యక్తి ద్వారా కరోనా సోకినట్టు తెలుస్తోంది.

కరోనా అంటించిన లారీ డ్రైవర్:
కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిలో ఉండే ఓ లారీ డ్రైవర్… కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. అయితే మొదట్లో అతడితో కరోనా లక్షణాలు కనిపించ లేదు. దీంతో ఇరుగుపొరుగున ఉన్న వారితో పేకాట ఆడాడు ఆ వ్యక్తి. ఆ తరువాత అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడితో పేకాట ఆడిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 17 మందికి కరోనా వచ్చినట్టు తేలింది. దీంతో కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిని పూర్తిగా మూసేశారు అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరికొందరిని కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లోనే ఉండాలని అన్నారు.

కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదు:
కరోనా వైరస్ మహమ్మారి పెద్ద తలనొప్పిగా తయారైంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి మిస్టరీగా మారింది. కొందరికి కరోనా సోకినా లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. మరికొందరి విషయంలో కరోనా ఉన్నా రిపోర్టుల్లో మాత్రం నెగిటివ్ అని వస్తోంది. గుర్తించే లోపే ఘోరం జరిగిపోతోంది. ఎవరి నుంచి ఎవరికి ఏ విధంగా వ్యాపిస్తుందో తెలుసుకోవడం కష్టంగా మారింది. అందుకే ఓ వ్యక్తికి కరోనా వచ్చిన వెంటనే… అతడికి కాంటాక్ట్‌లో ఉన్నవారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు అధికారులు. అయినా ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి.

విజయవాడలో కరోనా కల్లోలం:
ఇప్పటికే కృష్ణా జిల్లాలో 127 కేసులు నమోదు కాగా, ఒక్క విజయవాడ నగరంలోనే దాదాపు 100 కేసులు బయటపడ్డాయి. దీనికి తోడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘనలు ఎక్కువ కావడంతో కృష్ణలంక ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. దీంతో ఈ 17 కేసులు వెలుగు చూశాయి. ఇదంతా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే జరగడంతో కృష్ణలంక ప్రాంతాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు.

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు:
ఇక ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల్లో ఏపీ తెలంగాణను దాటేసింది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటాయి. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. నిన్నటివరకు కరోనా ఫ్రీగా ఉన్న శ్రీకాకుళం జిల్లాని కూడా కొవిడ్ తాకింది. శ్రీకాకుళం జిల్లాలో 3 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. ఇప్పటివరకు 171 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇప్పటివరకు 275 కేసులు, గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.