బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. మెగాస్టార్‌ చిరంజీవి పొలిటికల్‌ రీ ఎంట్రీ? ఏం జరుగుతోంది?

చిరు నోట జై జనసేన స్లోగన్‌ వినిపించడం వెనుక ఏదో వ్యూహం ఉందా?

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. మెగాస్టార్‌ చిరంజీవి పొలిటికల్‌ రీ ఎంట్రీ? ఏం జరుగుతోంది?

Updated On : February 10, 2025 / 8:35 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన సినీ కెరీర్‌ ఎంత ఇంట్రెస్టింగో..పొలిటికల్ అడుగులు కూడా అంతే సెన్సేషన్. ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకముందే.. కాంగ్రెస్‌లో విలీనం చేసి..రాష్ట్ర విభజన తర్వాత నో పాలిటిక్స్ అనేశారు మాస్టారు. కానీ గత రెండు మూడేళ్లుగా ఆయన మళ్లీ పాలిటిక్స్‌ వైపు అట్రాక్ట్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. దేశ ప్రధాని మోదీతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులతో చిరు సన్నిహితంగా ఉంటడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.

ఈ నేపథ్యంలో చిరు పొలిటికల్ రీఎంట్రీ ఖాయమన్న వార్తలు ఊపందుకున్నాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో బాస్‌ మరో బాంబ్‌ పేల్చేశారు. ఏకంగా ఓ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో జై జనసేన అనేశారు. ఫస్ట్‌ టైమ్ చిరంజీవి నోటీ నుంచి జనసేన ప్రస్తావన రావడం హాట్ టాపిక్ అవుతోంది. ఫ్యాన్స్‌తో కలిపి చిరు వాయిస్ వినిపించారా లేక ఫ్లోలో మాట్లాడేశారో తెలియదు కానీ..చిరు నోట జనసేన మాట రావడం మాత్రం..అటు సినీ, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది.

ప్రజారాజ్యం, జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు చిరు. జై జనసేన అని అన్నారు. ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా మారిపోయిందన్న మెగాస్టార్‌..ఐయామ్ వెరీ హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి వ్యాఖ్యలతో అటు మెగా, ఇటు జనసేన అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మెగాస్టార్‌ కామెంట్స్‌ మాత్రం పొలిటికల్‌గా చర్చనీయాంశం అయ్యాయి. 26 ఆగస్ట్, 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు చిరంజీవి.

అప్పట్లో యువరాజ్యానికి పవన్ నాయకత్వం
అప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం విభాగానికి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించారు. 2011లో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేశారు చిరంజీవి. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో మెర్జ్‌ చేయడం పవన్‌ కల్యాణ్‌కు ఇష్టం లేదని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే చిరుతో పవన్ విభేధించారని..కొన్నాళ్లు వాళ్లిద్దరి మధ్య గ్యాప్‌ కంటిన్యూ అయిందని కూడా టాక్ ఉంది. అదంతా అలా ఉండగానే 2014లో జనసేన పార్టీని పెట్టారు పవన్.

మెగాస్టార్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్నయ్యకు అన్నివిధాలుగా అండగా ఉండి కుడిభుజంగా నిలబడ్డారు పవర్ స్టార్. కానీ జనసేన పెట్టాక చిరంజీవి ఇప్పటివరకు ఓపెన్‌గా పవన్‌కు సపోర్ట్ చేయలేదంటున్నారు ఫ్యాన్స్. మొన్నటి ఎన్నికల్లో పవన్ ప్రభంజనం సృష్టించి..మెగాస్టార్ ఇంటికి వెళ్లి మరీ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ప్రమాణ స్వీకార వేదికపై చిరుకు పాదాభివందనం చేసి అన్నయ్యపట్ల తనకున్న మక్కువను చూపించారు. అయితే ఇప్పుడు చిరు జనసేనపై ఓపెన్‌గా స్టేట్‌మెంట్‌ ఇవ్వడం మాత్రం పవన్‌ విజయానికి దక్కిన గౌరవమేనని అంటున్నారు సేనాని ఫ్యాన్స్.

ప్రజారాజ్యం పార్టీతోనే పవన్‌ పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయింది కాబట్టి.. ప్రజారాజ్యమే జనసేనగా మారిందని చిరు కామెంట్ చేసి ఉండొచ్చు. అటు పవన్‌ పరంగ చూస్తే తన అన్నయ్య పొలిటికల్‌గా సక్సెస్‌ కాకపోవడాన్ని డైజెస్ట్‌ చేసుకోలేకే..రిస్క్‌ చేసి మరీ జనసేనతో తిరిగి రాజకీయ అరంగేట్రం చేశారు పవన్. ఇప్పుడు ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఫ్యూచర్‌లో పవన్‌ సీఎం అవుతారని అని కూడా ఆయన అభిమానులు చెప్తుంటారు. అయితే పవన్‌ రాజకీయాల్లో కసిగా పనిచేయడానికి ప్రజారాజ్యం తర్వాత చిరంజీవికి జరిగిన అన్యాయమేనన్న చర్చ జరుగుతోంది.

పొలిటికల్ స్క్రీన్‌ మీద చూడాలని తమ్ముడు ఆశ?
కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవిని.. మళ్లీ పొలిటికల్‌ స్క్రీన్‌ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట. చిరు సేవలను వాడుకోవాలని బీజేపీ చూస్తుంటే..ఇదే అదునుగా అన్నయ్య పొలిటికల్ స్క్రీన్‌ మీద చూడాలని తమ్ముడు ఆశ పడుతున్నారట. ఈ మధ్యే ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు చిరు. అయితే అందరిలో ఒకడిలా కాకుండా..చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడంపైనే ఇంట్రెస్టింగ్‌ చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలోనే ఈ మధ్య ఢిల్లీ వేదికగా చాలా డెవలప్‌మెంట్స్ జరిగాయని అంటున్నారు. అందులో భాగంగానే చిరంజీవిని బీజేపీ రాజ్యసభకు పంపబోతుందన్న టాక్‌ వినిపించింది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును తమకు కేటాయించాలని కోరుతున్నారట పవన్. జనసేన కోటాలో అన్నయ్యను పెద్దల సభకు పంపాలని..పరిస్థితులు కలిసి వస్తే రాబోయే ఎన్నికల వరకు పార్టీలో చిరును యాక్టీవ్‌ చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడట. బీజేపీతో కలిసి..సత్తా చాటితే తాను అనుకున్నట్లుగా చిరును ఉన్నతమైన స్థానంలో చూడొచ్చనేది పవన్‌ ఆలోచనట.

ఏదైమైనా చిరు నోట జై జనసేన స్లోగన్‌ వినిపించడం వెనుక ఏదో వ్యూహం ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఏదో కాకతాళీయంగా మాట్లాడారని అనుకోవడానికి లేదని.. లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌కు లింకు పెడుతున్నారు. జనసేన నుంచి చిరు రాజ్యసభకు వెళ్తారా..? పొలిటికల్‌ స్క్రీన్‌పై మెగా బ్రదర్స్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా అన్నది వేచి చూడాలి మరి.