Weather Updates : ఏపీలోని ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడ్రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు.. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
Weather Updates : ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజులు పాటు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని.. ఈ భిన్న వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Weather Updates
- ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్
- పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు
- ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది
- అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
Weather Updates : ఏపీలో ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలుసైతం దంచికొడుతున్నాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అదే సమయంలో సాయంత్రం వేళల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా కీలక విషయాన్ని తెలిపింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదేపరిస్థితి ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతోనే వానలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇవాళ (మంగళవారం) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాలు పడే సమయంలో పిడుగులతోపాటు, భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో రైతులు, కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. సోమవారం కృష్ణా జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 74 మండలాల్లో ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఎండ, ఉక్కపోత నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని, నీళ్లు ఎక్కువగా తాగాలి, మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని అధికారులు సూచించారు. మొత్తం మీద అటు వర్షాలు, ఇటు ఎండలతో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది.
