పసుపు బిళ్లతో వెళ్లండి, అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు- కార్యకర్తలకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ

మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.. మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, మీ పనేంటి అని అడిగి మీ అందరికి పని చేయించే విధంగా అధికారులను లైన్ లో పెడతా.

పసుపు బిళ్లతో వెళ్లండి, అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు- కార్యకర్తలకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ

Kinjarapu Atchannaidu : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఇబ్బండిపడ్డ టీడీపీ కార్యకర్తలు ఏమాత్రం అధైర్య పడొద్దన్నారు. రేపటి నుంచి ప్రభుత్వ ఆఫీసులకు పసుపు బిళ్లలతో వెళ్లాలన్నారు. అలా వెళ్లిన కార్యకర్తలను అధికారులు కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి టీ ఇచ్చి సమస్యలు పరిష్కరించేలా ఆదేశిస్తానని చెప్పారు. తన మాట వినని అధికారుల సంగతి కూడా తేలుస్తానని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

”కార్యకర్తలు అధైర్య పడొద్దు, ఎవరూ ఇబ్బంది పడొద్దు. 18 గంటలు ఈ జిల్లా గురించి, కార్యకర్తల గురించి పని చేస్తాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పని చెప్పినా చేసి తీరతాను. ఐదేళ్లు అవస్థలు పడ్డారు. ఐదేళ్లు అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను. అధికారులతో నేను చెబుతాను.

రేపటి నుంచి ప్రతీ కార్యకర్త ఎస్ఐ, ఎమ్మార్వో, ఎండీవో దగ్గరికి వెళ్లినా, ఏ ఆఫీసుకి వెళ్లినా.. మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.. మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, మీ పనేంటి అని అడిగి మీ అందరికి పని చేయించే విధంగా అధికారులను లైన్ లో పెడతా. ఎవరైనా ఒకరో ఇద్దరో అధికారులు నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని, అయినా ప్రజలెవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వ పాలనను 6 నెలల్లో గాడిలో పెడతామన్నారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు.

”ఐదారు నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మళ్లీ దేశంలో అగ్రగామిగా తయారు చేయడానికి మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ తో బండిని నడిపించాం. ఈరోజు రెండు ఇంజిన్ల బండి వచ్చింది. రెండు ఇంజిన్లు ఉంటే బండి ఎంత వేగంగా పరిగెడుతుందో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా గాడిలో పెడతాం” అని మంత్రి అచ్చెన్న అన్నారు.

వైసీపీ ప్రభుత్వం హయాంలో మరో పార్టీ అధికారంలో ఉండకూడదు అన్నట్లుగా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. గతంలో ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదని ఆయన వాపోయారు. పార్టీ ఉంటుందా? లేదా? అని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపారు.

”స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2019-24 ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని చూస్తే ఏ రకంగా పరిపాలించారో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గమైన వ్యక్తి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప మరొక రాజకీయ పార్టీ ఉండకూడదనే అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించాడో మనందరం సజీవ సాక్షులం. ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదు. నాలాంటి సీనియర్ ఎమ్మెల్యేనే బాధపడి నిద్రలేని రాత్రులు గడిపాం” అని మంత్రి అచ్చెన్నాయుడు వాపోయారు.

Also Read : ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? భారత్‌లో భారీ దుమారం రేపిన ఎలాన్ మస్క్ ట్వీట్