Aadabidda Nidhi Scheme: ఏపీలో మహిళలకు నెలకు రూ.1500.. ఆ స్కీమ్ పై మంత్రి కీలక ప్రకటన.. అమలు ఎప్పటి నుంచి అంటే..
సూపర్ సిక్స్‌లో కీలకమైన పథకాల్లో ఒకటి ఆడబిడ్డ నిధి. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న మహిళల్లో అర్హులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

Aadabidda Nidhi Scheme: ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ఈ స్కీమ్ ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలుపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడిగారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. దీనికి మంత్రి కొండపల్లి సమాధానం ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. త్వరలో పూర్తి విధివిధానాలు ప్రకటిస్తామన్నారాయన.
”ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం పరిశీలన జరుగుతోంది. అంచనాలు వేస్తున్నాం. గత ప్రభుత్వం లోటు బడ్జెట్ ఇచ్చినా తల్లికి వందనం, పెన్షన్ పెంపు, స్త్రీశక్తి లాంటి ఎన్నో పథకాలు చేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పథకంపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
”సూపర్ సిక్స్‌లో కీలకమైన పథకాల్లో ఒకటి ఆడబిడ్డ నిధి. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న మహిళల్లో అర్హులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా, గత ప్రభుత్వం మోపిన లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉన్నా హామీల అమలుపై ఆ ప్రభావం పడకుండా చూస్తున్నాం. 2014-2019 మధ్య కూడా పసుపు-కుంకుమ పేరిట మహిళలకు ఆర్థిక సాయం చేశాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించి ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేస్తాం” అని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల పేరుతో చంద్రబాబు పలు పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి పథకాలను ప్రభుత్వం అమలు చేసింది. సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలు కావాల్సి ఉంది. ఈ స్కీమ్ కోసం మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున అకౌంట్లలో జమ చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని మహిళలు ఎదురు చూస్తున్నారు.
Also Read: ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు పడేది ఆ రోజే.. అర్హుల లెక్క తేలింది.. ఎంతమంది అంటే..
View this post on Instagram