తప్పుచేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారు : మంత్రి లోకేశ్
స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని లోకేశ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ..

Nara Lokesh
Nara Lokesh : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేశ్ చిట్ చాట్ లో మాట్లాడారు. గత ఐదేళ్లు తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు. వైసీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్ననోటీసులు ఇస్తున్నా ఆ పార్టీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారు. నాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారు. వైసీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని లోకేశ్ చెప్పారు.
Also Read: Social Media Post Case : రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై మరో ఫిర్యాదు..
జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు కమిటీల ఓటింగ్ కు వస్తున్నారా? అని పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను లోకేశ్ అడిగారు.. లేదని వారు సమాదానం చెప్పడంతో.. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలి? ఓటింగ్ కు రావాలా వద్దా అనే మీమాంసలో ఎందుకు పడాలి? అంటూ లోకేశ్ అన్నారు. అనంతరం నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లుపై ఎమ్మెల్యేలతో లోకేశ్ చర్చించారు. ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారంటే.. వారి ఆశలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. జాగ్రత్తగా పని చేయమని బాధ్యతనిస్తూ ఎక్కువ ఓట్లతో మనల్ని ప్రజలు గెలిపించారని మర్చిపోవద్దని ఎమ్మెల్యేలకు లోకేశ్ సూచించారు. ఎమ్మెల్యేల వినతులపై స్వయంగా లోకేశ్ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే తనకు ఇచ్చిన ప్రతీ వినతిపత్రంలో ఎన్ని పరిష్కారమయ్యాయి, కాకుంటే అందుకు గల కారణాలు వివరిస్తూ లోకేశ్ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడా అమలు చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్టం చేస్తామని లోకేశ్ చెప్పారు.
Also Read: AP Rains : ఏపీకి వర్ష సూచన.. ఆ జిల్లాల్లో రెండు రోజులు అతి భారీ వర్షాలకు అవకాశం
స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని లోకేశ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని, పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే దీనిని ప్రస్తుతం అమలు చేస్తున్నామని లోకేశ్ చెప్పారు. ప్రస్తుతం వస్తున్న ఫీడ్ బ్యాక్ కు తగ్గట్లు నిర్ణయాన్ని మార్చుకుంటామని, విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంచేలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచుతామని లోకేశ్ పేర్కొన్నారు.