Minister Perni Nani : చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు.

Minister Perni Nani Hot Comments
Minister Perni Nani : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. చంద్రబాబు బందరు పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడారని మంత్రి పేర్ని నాని అన్నారు. పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా? పరామర్శించడానికి వచ్చారా? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిందని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.
20 నెలల్లోనే 97శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని ఆయన తెలిపారు.బందరు పోర్టు నిర్మాణం చెయ్యకుండా కృష్ణా జిల్లా ప్రజల్ని మోసం చేసారని..దేశంలో చంద్రబాబు చేసినంత రాజకీయ వ్యభిచారం ఎవరూ చెయ్యలేదని నాని విమర్శించారు. మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజమని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నీళ్లిస్తే ప్రజలు ఎందుకు ఓడించారో? చెప్పాలన్నారు.
చంద్రబాబు గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని నాని గుర్తు చేశారు. బెల్ట్ షాపులకు ప్రాణం పోసింది చంద్రబాబు కాదా? అని ఆయన అడిగారు. దొంగలకు, వెన్నుపోటుదారులకు చంద్రబాబు ఆదర్శం అని మంత్రి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో, బీజేపీ తో.. టిఆర్ఎస్ తో కూడా జత కట్టిన వ్యక్తి చంద్రబాబని..చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలకు అప్పులు ఇచ్చారా..? ఐదేళ్లు అందినకాడికి అప్పులు తెచ్చి రాజకీయ అవసరాలకు వాడుకున్నారని మంత్రి అన్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతోందని..ఎక్కడికక్కడ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే అవన్నీ కట్టుకుంటూ వచ్చాం అని నాని తెలిపారు.