ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు

అధికార వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి, ప్రస్తుత ఎమ్మెల్యేకి అస్సలు పడడం లేదంట. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వీరి ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. తమకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారంటూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మండిపడుతూ ఉంటే… తమ మధ్య స్నేహపూర్వక వాతావరణం తప్ప వివాదాలకు తావులేదని మీడియాకు సమాచారం ఇస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి. తమకు సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలను ఎలా చేర్చుకుంటారంటూ మండిపడుతున్నారు హఫీజ్. ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
వాళ్ల సభ్యత్వం చెల్లదు :
అధినేత జగన్ అనుమతి లేకుండా, తనకు సమాచారం కూడా ఇవ్వకుండా కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించడంపై ఎస్వీ మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపోతున్నారట. స్థానికంగా ఎమ్మెల్యే అనుమతి లేకుండా పార్టీలో చేరే వాళ్ల సభ్యత్వం అసలు చెల్లదని తెగేసి చెప్పేస్తున్నారు. తాను సామాన్య కార్యకర్తనంటున్న ఎస్వీ మోహన్‌రెడ్డి…. పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చేంత వరకూ భుజాలపై జెండా మోసిన సీనియర్ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తీసుకోకపోవడం ఏంటంటూ నిలదీస్తున్నారు.
గతంలో పార్టీకి ద్రోహం చేసేందుకు యత్నించి, టీడీపీలోకి వెళ్లిపోయిన ఎస్వీ మోహన్‌రెడ్డి… ఆ తర్వాత తన తప్పులను సరిదిద్దుకుంటానని, ఒక్క చాన్స్ ఇవ్వాలని జగన్‌ను కోరడం వల్లే అవకాశం ఇచ్చారని హఫీజ్ అంటున్నారు. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తున్నట్టుగా ఉందని కస్సుబుస్సులాడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మూడు రాజధానులు, సీఆర్డీఏ అంశాలపై అసెంబ్లీలో పోరాటం చేస్తున్న నేపథ్యంలో వడ్డేగేరి ప్రాంతంలో ఉన్న కొందరిని తనకు సమాచారం ఇవ్వకుండా పార్టీలోకి చేర్చుకోవడం ఏం పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతోందంట. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు.
మాకు ఎలాంటి విభేదాలు లేవు :
మరోపక్క, అసలు పార్టీని మరింత పటిష్టం చేసేందుకే ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు ఎస్వీ మోహన్‌రెడ్డి. తమ మధ్య గిట్టని వారు చేస్తున్న ప్రచారం తప్ప, అసలు హఫీజ్ ఖాన్‌తో తనకెలాంటి విభేదాలు లేవని అంటున్నారు. తాను పార్టీ బలోపేతానికి చేస్తున్న చర్యలను అధినేతకు తెలుసునని చెప్పుకొస్తున్నారట.
తాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నానే తప్ప ఎవరికీ పదవుల గురించి హామీ ఇవ్వడం లేదని వివరణ ఇచ్చుకుంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. హఫీజ్ ఖాన్ తనకు మంచి మిత్రుడని అంటున్నారు. కాకపోతే.. పార్టీ కార్యకర్తలు మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని గుసగుస లాడుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు కల్పించుకోవాలని కేడర్ కోరుతోంది.