ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. ఆ నియోజకవర్గంలో వైసీపీలో ఆధిపత్య పోరు, అడ్వాంటేజ్‌గా తీసుకున్న అధికారులు

అసెంబ్లీ నియోజకవర్గం అంటే దానికో ఎమ్మెల్యే ఉంటారు. అక్కడి వరకు ఆయనే బాస్. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రి పెత్తనం ఎక్కువైపోయిందని, ఆ ఎమ్మెల్యే బాధ. రాజకీయాల్లో జూనియర్ కావడంతో ఆ సీనియర్ మంత్రి తన ఆధిక్యాన్ని చూపిస్తున్నారని మదన పడిపోతున్నారు. ఎమ్మెల్యే, మంత్రి మధ్య ఆధిపత్య పోరుని అధికారులు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారా? ఎమ్మెల్యే మాటను నియోజకవర్గ అధికారులు పెడచెవిన పెడుతున్నారా?
మంత్రి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఎమ్మెల్యే:
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వెర్సస్ జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్ అంటూ సాగుతున్న నియోజకవర్గ రాజకీయాలను అధికారులు అడ్వాంటేజ్‌గా తీసుకోవడమే దీనికి కారణమంట. మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కొండేటి చిట్టిబాబుకు రాజకీయ అనుభవం తక్కువ కావడంతో మంత్రి విశ్వరూప్ ఆ నియోజకవర్గ రాజకీయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారట. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గానికి ఆనుకుని పి.గన్నవరం నియోజకవర్గం ఉండటంతో అధికారులు కూడా మంత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారట. దీనితో మంత్రి ఆధిపత్యాన్ని ఎమ్మెల్యే చిట్టిబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
ఇసుక అక్రమ రవాణ ఆరోపణలు, నడిరోడ్డుపై బర్త్ డే వేడుకలు:
తనను అసెంబ్లీకు పంపించిన అనుచరులకు, కార్యకర్తలకు అవసరమైన చిన్న చిన్న పనులు కూడా చేయలేక ఎమ్మెల్యే చిట్టిబాబు చాలా ఫీలవుతున్నారట. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెప్పుకుంటూ వాపోతున్నారట. పి.గన్నవరం నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ ఆధిపత్యం చెలాయించడానికి ఎమ్మెల్యే చిట్టిబాబు వైఖరే కారణమని పార్టీలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలోనే ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే చిట్టిబాబుపై బహిరంగ ఆరోపణలు వినిపించడం, అంబాజీపేటలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ను ఆపి మరీ తన పుట్టినరోజు వేడకలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే తనయుడు కొండేటి వికాస్ బాబు చేసిన ఓవరాక్షన్‌తో పాటు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సోదరుడు అతి జోక్యంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయట.
ఎమ్మెల్యేని డోంట్ కేర్ అంటున్న అధికారులు:
ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గంలోని ప్రధాన ఇసుక ర్యాంపుల బాధ్యత పార్లమెంట్ ఇన్ చార్జి తోట త్రిమూర్తులకు అప్పగించిన అధిష్టానం… పి.గన్నవరం నియోజకవర్గంపై ఓ లుక్ వేయాలని మంత్రి విశ్వరూప్‌కు అనధికారిక ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై మంత్రి విశ్వరూప్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుల మధ్య ఆధిపత్య పోరును నియోజకవర్గంలో అధికారులు అడ్వాంటేజ్‌గా తీసుకున్నారని ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న టాక్. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో అధికారులు ఎమ్మెల్యే చిట్టిబాబును అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు.
భూముల కొనుగోలులో అక్రమాలు:
మిగిలిన విషయాల మాట ఎలాగున్నా ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల విషయంలో ఎమ్మెల్యేను అధికారులు అసలు సంప్రదించ లేదట. ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములకు సంబంధించి జిల్లాలో ఆరు చోట్ల అవకతవకలు జరగ్గా ఒక్క పి.గన్నవరం నియోజకవర్గంలో మూడు చోట్ల జరిగాయని అక్కడ వినిపిస్తున్న టాక్. ఎమ్మెల్యే చిట్టిబాబుకు తెలియకుండా అమలాపురం కేంద్రంగా ఈ మూడు వ్యవహారాలు చక్కబెట్టడంతో అటు ప్రభుత్వానికి ఇటు ఎమ్మెల్యేకు చెడ్డపేరు వచ్చిందని చిట్టిబాబు వర్గం చెవులు కొరుక్కుంటున్నారు.
ముంపు ప్రాంతంలో భూములను అధిక ధరలకు కొనుగోలు:
ధవళేవ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మునిగిపోయిన భూములను అధిక ధరలకు అధికారులు కొనుగోలు చేశారు. ఈ భూముల విషయం గానీ, అక్కడ ఉన్న ధరల విషయం గానీ చిట్టిబాబుకు కనీస సమాచారం ఇవ్వకుండా నేరుగా శంకుస్థాపనకు ఆహ్వానించారట. అధికారుల ఆహ్వానంతో శంకుస్థాపనకు వెళ్ళిన ఎమ్మెల్యే ఆ భూములను చూసి అవాక్కయ్యారట. మునిగిపోయే ప్రాంతంలో అధిక ధరలకు భూములు కొనడంతో పాటు అక్కడ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి అదనపు భారం అవుతుందని శంకుస్థాపన చేయకుండా వెనక్కి వచ్చేశారని అనుచరులు అంటున్నారు.
ఏమీ చేయలేక మౌనంగా ఎమ్మెల్యే:
అధిష్టానం కూడా తన మీద ఆగ్రహంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోతున్నారట చిట్టిబాబు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యానన్న ఆనందం కూడా ఆయనలో కనిపించడం లేదంటున్నారు. ఇసుక లభ్యత అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన పి.గన్నవరంలో ఎక్కడా తన మాట చెల్లుబాటు కావడం లేదని లోలోన మదన పడిపోతున్నారట. ఇటీవల పార్టీలో చేరి, అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్న తోట త్రిమూర్తులు తన నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులపై అధికారం చలాయించడాన్ని ఎమ్మెల్యే చిట్టిబాబు సహించలేకపోతున్నారట. అధిష్టానంకు ఫిర్యాదు చేసే ధైర్యం లేక, మంత్రి విశ్వరూప్, పార్లమెంట్ ఇన్ చార్జి తోట త్రిమూర్తుల ఆధిపత్యాన్ని సహించ లేక చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారని అనుకుంటున్నారు.