Kotamreddy Sridhar Reddy : తమ్ముడు ఎమ్మెల్యే కావాలని రొట్టె వదిలిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకం ఇదే!
Kotamreddy Sridhar Reddy : తన తమ్ముడు ఎమ్మెల్యే కావాలని కోరుతూ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వర్ణాల చెరువులో ఎమ్మెల్యే రొట్టె వదిలారు.
Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy : నెల్లూరు జిల్లాలోని బారాషాహిద్ రొట్టెల పండుగ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ రొట్టెల పండుగ భక్తుల రద్దీతో వైభవంగా జరిగింది. సుమారు 415ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండుగలో రాష్ట్రం నలుమూలలతోపాటు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. బారాషహీద్ దర్గాను దర్శించుకున్న అనంతరం భక్తులు స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్నికొనసాగిస్తారు. ఆయా కోరికలు కోరుకున్నవారు అప్పటికే ఆ కోరిక నెరవేరిన వారి నుంచి రొట్టెలు తీసుకుంటారు. రొట్టె తీసుకున్నాక తమ కోరిక నెరవేరితే మరుసటి ఏడాది వచ్చి వేరొకరికి రొట్టె ఇస్తుంటారు. మళ్లీ వేరొక కోరిక ఉంటే దానికి సంబంధించిన రొట్టె తీసుకుంటారు. తాజాగా… నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే రొట్టె వదిలారు.
ఈ ఏడాది పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వదిలిన ఎమ్మెల్యే రొట్టె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ ఆయనకు ఎమ్మెల్యే రొట్టె అందజేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి సుజిత, కుమార్తె సాయి వైష్ణవి బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టె వదిలారు. ఆ రొట్టెను గిరిధర్ రెడ్డి స్వీకరించారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి సుజిత మాట్లాడుతూ.. గిరిధర్ రెడ్డిని తమ కుమారుడిలాగే పెంచామని, ఆయన ఎమ్మెల్యే కావాలనేది కుటుంబ సభ్యులందరి ఆకాంక్ష అని తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. బారాషహీద్ రొట్టెల పండుగ తమ కుటుంబానికి సెంటిమెంట్ అని, తాను ఎమ్మెల్యే అయిన తరువాత 12వ సారి అధికారికంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తన సోదరుడికి పార్టీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లను కోరారు.
రొట్టెల పండుగ విశిష్టత ఇదే..
ఇదిలాఉంటే.. ఈ రొట్టెల పండుగకు ఎంతో విశిష్ఠత ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు 415 సంవత్సరాల క్రితం నెల్లూరు పాలించిన వాలాజా నవాబు కుమార్తె చర్మవ్యాధితో బాధపడుతుండగా.. బారాషహీద్ దర్గా మట్టిని పూయడంతో ఆమె వ్యాధి నయమైంది. దర్గా దగ్గర మట్టిపూస్తే నవాబు కుమార్తె చర్మ వ్యాధి పోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో నవాబు కుమార్తెను చూసేందుకు చుట్టుపక్కల ఊళ్ల జనాలు భారీగా తరలివస్తారు.అదే సమయంలో వాలాజా నవాబు తరఫు బంధువులు 300 మంది వస్తారు. వాళ్లంతా రొట్టెలు తింటుంటే తమకు కూడా రొట్టెలు ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరుతారు. అయితే తమ వద్ద 300 మందికి సరిపడా రొట్టెలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ వేలాది మంది ఉండటంతో వారందరికీ రొట్టెలు అందించలేమని నవాబుకు భటులు తెలియజేస్తారు. అందులోనూ వేసవికాలం కావడంతో రొట్టెలు గట్టిగా అయిపోయాయి అని చెప్తారు. దీంతో నవాబు అల్లా మీద నమ్మకంతో వచ్చానని… ఆయన్ని తలచుకుని రొట్టెలను చెరువులో ముంచి, ముక్కలు చేసి తలా ఒక ముక్క ఇవ్వండని భటులను ఆదేశిస్తారు. అలా భటులు రొట్టెలు తుంచి ప్రజలకు ఇస్తారు. అందరి కడుపు నిండా రొట్టెలు పంచగా ఇంకా మిగిలిపోతాయి. ఆ రోజు నుంచి ఏదైనా కోరిక ఉంటే అల్లా పేరుతో మనం ప్రయత్నం చేస్తే కోరిక తీరుతుందని ప్రచారంలోకి వచ్చింది. అలా మొదలైన రొట్టెల పండుగ ఇప్పుడు ప్రాంతాలకు, మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు వచ్చి జరుపుకునే ఉత్సవంలా మారింది అని స్థానికులు చెప్తున్నారు.
