Pulivarthi Sudha Reddy : దమ్ముంటే రా.. చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్..
చెవిరెడ్డి అక్రమాస్తుల వివరాలు తన దగ్గర ఉన్నాయన్న పులివర్తి సుధారెడ్డి.. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి చెవిరెడ్డికి ఫోన్ చేశారు.

Pulivarthi Sudha Reddy : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్ విసిరారు. లంచాలు తీసుకుంటున్నట్లు చెవిరెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న సుధారెడ్డి.. తనపై చేస్తున్న ఆరోపణలకు చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
తనపై అవినీతి ఆరోపణలను నిరూపించాలంటూ చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గరికి వచ్చి సుధారెడ్డి ఛాలెంజ్ చేశారు. చెవిరెడ్డి అక్రమాస్తుల వివరాలు తన దగ్గర ఉన్నాయన్న పులివర్తి సుధారెడ్డి.. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి చెవిరెడ్డికి ఫోన్ చేశారు. అయితే, ఆయన స్పందించలేదు.
”ఎమ్మెల్యే నానిని ఢీకొట్టలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? నేను లంచం తీసుకున్నట్లు నాపై అభియోగం వేశారు. చెవిరెడ్డి తన అఫీషియల్ పేజీలో, వైసీపీ పేజీలో నా గురించి పోస్ట్ పెట్టారు. ఎమ్మెల్యే భార్య అని రాశారు. ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే భార్య స్పష్టంగా రాయండి. నాపై చేసిన ఆరోపణలకు మీరు రుజువులు తీసుకుని రావాలని చెప్పాను. కానీ, మీరు రాలేదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడం లేదు” అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఎమ్మెల్యే నాని భార్య సుధారెడ్డి నిప్పులు చెరిగారు.
Also Read : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీపై నారా లోకేశ్ ప్రకటన
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నాని మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. గడిచిన రెండు మూడు రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డిపై కొన్ని కథనాలు వచ్చాయి. దీన్ని సుధారెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు.
రేపు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరికి నేను వస్తాను, నాపై వచ్చిన ఆరోపణలను నిరూపించండి అంటూ సోషల్ మీడియా వేదికగా నిన్న చెవిరెడ్డికి సవాల్ విసిరారు పులివర్తి సుధారెడ్డి. చెప్పినట్లుగానే సుధారెడ్డి ఇవాళ నేరుగా చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి నిరసన తెలిపారు. చెవిరెడ్డి వెంటనే వచ్చి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఒక మీడియాలో తనకు వ్యతిరేకంగా, దురుద్దేశపూర్వకంగా చెవిరెడ్డి వార్తలు రాయిస్తున్నారని, వాటిని నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఐదేళ్లలో 400 ఎకరాలు కబ్జా చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని, అందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పులివర్తి సుధారెడ్డి చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను వచ్చి నిరూపించాలంటూ చెవిరెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు సుధారెడ్డి.
Also Read : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఎవరెవరు గెలిచారో తెలుసా?
ఈ వ్యవహారంపై ఇప్పుడే తేల్చుకుంటాను అంటూ నేరుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి మూడుసార్లు ఫోన్ కూడా చేశారు సుధారెడ్డి. అయితే, చెవిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఒకవైపు ఎమ్మెల్యే నాని అసెంబ్లీలో ఉండగా, మరోవైపు ఆయన సతీమణి సుధారెడ్డి చెవిరెడ్డికి బహిరంగ సవాల్ విసరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే.. బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు పులివర్తి సుధారెడ్డి.