అనపర్తిలో హై టెన్షన్ : నేతల ప్రమాణాలు, విన్నావా వినాయక!

MLA Suryanarayana Reddy Vs Nallamilli Ramakrishna Reddy : తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హై టెన్షన్ నెలకొంది. బిక్కవోలు గణపతి ఆలయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సత్య ప్రమాణం చేశారు. అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రమాణాలు చేశారు. దీంతో బిక్కవోలు, అనపర్తిలలో 144 సెక్షన్ అమలు చేశారు. స్థానికంగా భారీగా పోలీసులను మోహరించారు.
అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే సూర్య నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్యప్రమాణాలాకు బిక్కవోలు వినాయక విగ్రహం వేదికైంది. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం సత్యప్రమాణాలు చేద్దామంటూ ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకోవడంతో బిక్కవోలులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల భారీ భద్రత నడుమ అనపర్తి ఎమ్మెల్యే సూర్య నారాయణరెడ్డి వినాయక ఆలయంలో సత్య ప్రమాణం చేశారు. తన భార్యతో కలిసి వచ్చిన సూర్య నారాయణరెడ్డి వినాయకుడి ముందు తాను ఏ అవినీతికి పాల్పడలేదంటూ ప్రమాణం చేశారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తన సతీమణితో కలిసి వినాయక ఆలయానికి చేరుకున్నారు. సూర్యనారాయణరెడ్డి ప్రమాణం పూర్తయిన తర్వాత… పోలీసులు రామకృష్ణారెడ్డిని ఆలయంలోకి ఆహ్వానించారు. దీంతో ఆలయంలోకి తన సతీమణితో వెళ్లిన రామకృష్ణారెడ్డి…. వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. ఇద్దరు నేతల సత్యప్రమాణం నేపథ్యంలో పోలీసులు బిక్కవోలులో భారీగా మోహరించారు. మంగళవారం నుంచే బిక్కవోలు, అనపర్తిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జనం గుంపు కూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మైనింగ్ సహా పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సూర్యనారాయణరెడ్డి బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో నేతలిద్దరూ సత్యప్రమాణం చేశారు.