AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కల్లోలం.. ఇవాళ కూడా 10 వేలపైనే పాజిటివ్ కేసులు

AP Coronavirus Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు 10వేలకు పైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో 10,548 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 4,11,269కు పెరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 56 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మరో 82 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,796కు పెరిగింది.
కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరులో 11 మంది, తూర్పు గోదావరిలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, అనంతపురంలో 6, గుంటూరులో 6, కర్నూలులో 6, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 5, శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4, కడపలో 2, కృష్ణా జిల్లాలో 2 మంది మరణించారు.
కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి 8,976 మంది డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 4,11,269 పాజిటివ్ కేసులకు గాను, 3,09,762 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 97,681 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.