Alla Ramakrishna Reddy: రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే.. అలాకాకుంటే పొలంలో పనిచేసుకుంటా..
ఓ వర్గం చిన్న విషయాన్ని ఆసరా చేసుకొని నన్ను టార్గెట్ చేస్తుంది. పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా. అలా జరగకపోతే పొలం పనులు చూసుకుంటా. ఎప్పటికీ నా బాస్ జగనే అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి అన్నారు.

Alla Ramakrishna Reddy (Photo Facebook)
MLA Ramakrishna Reddy: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అధ్యక్షతన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో మంగళగిరి నియోజకవర్గం (Mangalagiri Constituency) ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి (MLA Alla Ramakrishna Reddy) కూడా ఒకరు. అయితే, ఆళ్ల పార్టీ మారుతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని రామక్రిష్ణారెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీ (YCP party) కి ఏనాడు దూరం అవ్వనని స్పష్టం చేశారు. నా పంటికి చిన్న సర్జరీ జరిగిందని, మా అబ్బాయి ఇంట్లో శుభకార్యం ఉందని అందుకే సోమవారం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో పాల్గొనలేక పోయానని అన్నారు.
Sajjala Ramakrishna Reddy: ఎవ్వరిలో అసంతృప్తి లేదు, అంతా సమసిపోతుంది: సజ్జల రామకృష్ణ రెడ్డి

Alla Ramakrishna Reddy (Pic: FB)
ఓ వర్గం చిన్న విషయాన్ని ఆసరా చేసుకొని తనను టార్గెట్ చేస్తున్నారని, పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని, అలా జరగకపోతే పొలం పనులు చూసుకుంటానని చెప్పుకొచ్చారు. ఎప్పటికీ నా బాస్ జగనేనని, ఆయన వెంటే రాజకీయాల్లో నడుస్తానని ఆళ్ల స్పష్టం చేశారు.
మగళగిరి ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారని, తాను నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు.. నియోజకవర్గం మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంగళగిరిలో ఒక్కపని చేయలేదని అన్నారు. నియోజకవర్గంలో నేను పర్యటనలు చేస్తున్నానని, చంద్రబాబు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్ప నియోజకవర్గం వెళ్లాడంటూ ఆళ్ల ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ హోదాలో, గత ప్రభుత్వం హయాంలో మూడు శాఖల మంత్రిగా ఉన్న లోకేశ్ ఎన్నిసార్లు మున్సిపల్ సమావేశాలకు వచ్చాడు? జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరయ్యాడు అంటూ ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ప్రశ్నించారు. తనను కావాలనే కొందరు పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని, పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసిన వై.ఎస్. జగన్ నుంచి పేదల్ని విడదీయలేరని అన్నారు. మంగళగిరి ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని, మళ్లీ మంగళగిరి నియోజకవర్గంలో గెలిచేది వైసీపీ అభ్యర్థేనని ఎమ్మెల్యే ఆళ్ల అన్నారు.