Ravulapalem Gun Firing : సంచలనం రేపిన రావులపాలెం కాల్పుల కేసులో వీడని మిస్టరీ.. అసలేం జరిగింది?

ఈ కాల్పులకు అసలు కారణం ఆర్థిక లావాదేవీలా? వ్యక్తిగత కక్షలా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. వ్యాపార ఆధిపత్యమా? అంతర్గత వ్యవహారాలా? వివాహేతర సంబంధమా? అనే విషయాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం ఉంది.

Ravulapalem Gun Firing : సంచలనం రేపిన రావులపాలెం కాల్పుల కేసులో వీడని మిస్టరీ.. అసలేం జరిగింది?

Updated On : September 6, 2022 / 5:56 PM IST

Ravulapalem Gun Firing : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఫైనాన్షియర్ ఆదిత్య రెడ్డిపై హత్యయత్నం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే కోనసీమలో కాల్పులు ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. బాధితుడు ఆదిత్య రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. పలు కోణాల్లో అతడిని ప్రశ్నిస్తూ సమాచారం రాబడుతున్నారు.

ఈ కాల్పులకు అసలు కారణం ఆర్థిక లావాదేవీలా? వ్యక్తిగత కక్షలా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. వ్యాపార ఆధిపత్యమా? అంతర్గత వ్యవహారాలా? వివాహేతర సంబంధమా? అనే విషయాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం ఉంది. స్థానికులతో కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారితో కానీ ఆదిత్య రెడ్డికి ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఏమైనా జరిగాయా? అన్న కోణంలో పోలీసలు ఆరా తీస్తున్నారు.

ఆదిత్యపై కాల్పులు జరిపిన నిందితులు తాము తెచ్చుకున్న బ్యాగును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ బ్యాగులో నాలుగు నాటుబాంబులు, జామర్, రెండు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్, నవ్వు తెప్పించే లాఫింగ్ గ్యాస్ బాటిల్, మూడు ఖాళీ సిరంజీలు, ఆరు బుల్లెట్లు, చేతులు, నోటిని బంధించేందుకు ఉపయోగించే రెండు ప్లాస్టర్ బండిల్స్ ఉండటంతో దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పోలీస్ శాఖ అనుమానిస్తోంది. అలాగే తుపాకీ నుంచి జారిపడిన మ్యాగజీన్ లో 5 బుల్లెట్లు, గాల్లోకి కాల్చిన బుల్లెట్లలో ఒకటి, ఇద్దరు వ్యక్తుల చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పోలీసులు పరీక్షలకు పంపారు.

దుండగులు తిరిగిన ప్రాంతాల్లో వారు తెచ్చిన వస్తువులపై వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించింది. బుల్లెట్లను హైదరాబాద్ లోని ల్యాబ్ కు, మిగిలిన వస్తువులను విజయవాడలోని ల్యాబ్ కి పంపారు. స్వాధీనం చేసుకున్న బ్యాగ్ లో రాజమండ్రిలో కొనుగోలు చేసిన మత్తుమందులు, ఇంజెక్షన్లు ఉండటంతో అక్కడి మందుల దుకాణం ద్వారా నిందితులను గుర్తించేలా కేసు దర్యాఫ్తు జరుగుతోంది. దుండగులు తెచ్చిన పరికరాలను చూస్తుంటే కిడ్నాప్ చేసేందుకు వచ్చినట్లు పోలీసుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. తుపాకీ, నాటుబాంబులను తేవడంతో దీని వెనుక పెద్ద పన్నాగమే ఉందని భావిస్తున్నారు పోలీసులు.

ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డి గత జూన్ లో అనారోగ్యంతో మరణించారు. ఆయన వడ్డీకి ఇచ్చిన అప్పులు తీర్చమని చిన్న కుమారుడు ఆదిత్య రెడ్డి రుణగ్రహీతలపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. అప్పులు తీసుకున్న వారికి, ఆదిత్యకి మధ్య గొడవలు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా బయటి వ్యక్తులతో బెదిరించటానికి ఇలా చేశారా? లేక వ్యాపార విభేదాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది.

మరోవైపు గత జనవరిలో ఆదిత్య రెడ్డి కారులో మారేడుమిల్లి వెళ్లి వస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు తమ కారుతో అతడి కారును ఢీకొట్టడంతో వివాదం జరిగింది. ఆదిత్య రెడ్డిని కారులో పెట్టి సుమారు 30మంది కొట్టినట్లు పోలీసుల దర్యాఫ్తులో వెలుగులోకి వచ్చింది. ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాఫ్తును ముమ్మరం చేశారు.