Nagababu: మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. జగన్ ఇలా హాస్యం పండిస్తున్నారు: నాగబాబు వార్నింగ్

అధికారం వచ్చింది కదాని నేతలెవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదని నాగబాబు చెప్పారు.

Nagababu: మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. జగన్ ఇలా హాస్యం పండిస్తున్నారు: నాగబాబు వార్నింగ్

Nagababu

Updated On : March 14, 2025 / 8:01 PM IST

మాట్లాడేటప్పుడు నాయకులు జాగ్రత్తగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో 12వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. ఇందులో నాగబాబు మాట్లాడారు.

నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో ఏపీలో చూశామని నాగబాబు చెప్పారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన నేతకు ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదని అన్నారు. జగన్‌ వంటి వారు ఎన్నో కలలు కంటున్నారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారని తెలిపారు.

ఇటువంటి వ్యాఖ్యలతో అద్భుతంగా హాస్యం పండిస్తున్నారని నాగబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ భవిష్యత్‌ తరాల గురించి ఆలోచిస్తారని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ ఛాన్స్‌ ఇచ్చిన పవన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

తాను జనసైనికుడినని, ఈ మాట చెప్పుకొనేందుకు గర్వపడుతున్నానని నాగబాబు తెలిపారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్ విజయం సాధించడానికి ఇక్కడి ప్రజలే కారణమని చెప్పారు. జనసేన శ్రేణులకు పార్టీ 12వ ఆవిర్భావ శుభాకాంక్షలని అన్నారు.

అధికారం వచ్చింది కదాని నేతలెవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదని నాగబాబు చెప్పారు. పవన్‌ చాలా క్రమశిక్షణ ఉన్న నేత అని తెలిపారు. జనసేన స్థాపించాక ఇప్పటివరకు ఎన్నో ఒడిదుడుకులు ఆయన ఎదుర్కొన్నారని చెప్పారు. పిఠాపురంలో విజయం సాధిస్తామని పవన్‌ కల్యాణ్‌ ముందే ఊహించారని అన్నారు. 20 ఏళ్లలో ఏపీ స్వర్ణయుగం చూడబోతుందని చెప్పారు.