Nandigama Constituency: నందిగామ టీడీపీలో గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయా?

నందిగామ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనేలా ఉంది పరిస్థితి. క్యాడర్‌ను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనే టాక్ కూడా ఉంది.

Nandigama Constituency: నందిగామ టీడీపీలో గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయా?

Nandigama Assembly Constituency

Updated On : August 3, 2023 / 3:08 PM IST

Nandigama Assembly Constituency: టీడీపీకి కంచుకోట నందిగామ.. 30 ఏళ్లలో ఇక్కడ ఓటమి ఎరగని తెలుగుదేశానికి గత ఎన్నికలు షాకిచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు (Monditoka Jagan Mohan Rao) విజయం సాధించి.. టీడీపీకి ఓటమి రుచిచూపించారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జగన్మోహానరావు పనితీరు ఎలా ఉంది? టీడీపీ (TDP) మళ్లీ పునర్ వైభవం సాధ్యమేనా? లేక మళ్లీ వైసీపీ జెండానే ఎగురుతుందా?

Monditoka Jagan Mohan Rao

Monditoka Jagan Mohan Rao

నందిగామ నియోజకవర్గంలో ఓటర్లు చైతన్యవంతులు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారికి మాత్రమే పట్టం కడుతారని రాజకీయ వర్గాల అభిప్రాయం. ముప్పయ్యేళ్లుగా తిరుగులేని విజయం సాధించిన టీడీపీకి ఇక్కడ పటష్టమైన క్యాడర్ ఉంది. ఓటమి అంటే ఏమిటో తెలియని ఆ పార్టీకి 2019లో షాక్ ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇక్కడ టీడీపీయేతర పార్టీ గెలిచింది 2019లోనే.. వృత్తి రీత్యా డాక్టర్ అయిన జగన్మోహనరావు 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేసి 2019లో ఘన విజయం సాధించారు.

Monditoka Arun Kumar

Monditoka Arun Kumar

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే నందిగామ నియోజకవర్గానికి రాజకీయంగా అగ్రస్థానం కట్టబెడుతోంది వైసీపీ. ఎమ్మెల్యే జగన్మోహనరావు రికార్డు విజయం సాధిస్తే.. ఆయన సోదరుడు అరుణ్‌కుమార్‌ (Monditoka Arun Kumar) ను ఎమ్మెల్సీ చేసింది వైసీపీ. అన్నదమ్ములు ఇద్దరు నియోజవర్గంలో పార్టీని బలంగా నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే జగన్మోహనరావుపై ఎలాంటి ఆరోపణ లేకపోవడంతో క్లీన్ ఇమేజ్‌తో మరోసారి టిక్కెట్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సోదరులు ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది మాత్రం సస్పెన్స్. ఎమ్మెల్యే జగన్మోహనరావుపై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా.. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌కు అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఒక్కటే అన్న అభిప్రాయంతో ఉంది క్యాడర్. ఇక రోడ్ల విస్తరణ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, రెవెన్యూ డివిజన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇలా అభివృద్ధి పనులతోపాటు ఎన్నో సమస్యలను పరిష్కరించారు ఎమ్మెల్యే. ఐతే కార్యకర్తలు చేసిన పనులకు బిల్లులు చేయించలేకపోవడంతో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఏదైనప్పటికీ మళ్లీ తానే గెలుస్తానని అంటున్నారు ఎమ్మెల్యే జగన్మోహనరావు.

Tangirala Sowmya

Tangirala Sowmya

గత ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ గెలవాలనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుండగా, ప్రతిపక్ష టీడీపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ నియోజవర్గాన్ని గ్రూపు గొడవలు వెంటాడుతున్నాయి. ఎంపీ కేశినేని నాని (Kesineni Nani), ఆయన సోదరుడు కేశినేని చిన్ని (Kesineni Chinni) వర్గాలుగా విడిపోయింది టీడీపీ. ఎంపీ కేశినేని నాని అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ ఇన్‌చార్జి తంగిరాల సౌమ్య (Tangirala sowmya)కి ఇబ్బందులు పెడుతున్నట్లు ఉందని కార్యకర్తలు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎంపీ నాని తరచుగా నందిగామలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల్లో స్వపక్షానికన్నా ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లను ఆకాశానికి ఎత్తేస్తుండటం హాట్‌టాపిక్‌గా మారుతోంది. క్యాడర్‌లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఎంపీపై సౌమ్య వర్గం అధిష్టాన వర్గాన్ని ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా ఎంపీ వర్గం ఇన్‌చార్జి సౌమ్యకి వ్యతిరేకంగా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతోంది. స్థానిక నినాదంతో కన్నెగంటి జీవరత్నం అనే నాయకుడికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది ఎంపీ వర్గం. పార్టీ అధినేత చంద్రబాబు ఈ ప్రతిపాదనను తిరస్కరించినా ఇన్‌చార్జి సౌమ్యకు తలనొప్పి మాత్రం తగ్గడంలేదు.

Also Read: రోజురోజుకి వేడెక్కుతున్న మచిలీపట్నం రాజకీయం.. ఈసారి పోటీ మామూలుగా ఉండదు!

తండ్రి తంగిరాల ప్రభాకర్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్య అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై గట్టిగా పోరాడలేకపోతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధిపత్యాన్ని ఇన్‌చార్జిగా సౌమ్య అడ్డుకోలేకపోతున్నారు. ఉమా పొడగిట్టని నాని వర్గం సౌమ్యను టార్గెట్ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే మూడు రాజధానుల అంశం కలిసి వస్తుందన్న ధీమాతో ఉంది టీడీపీ. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం టీడీపీకి అడ్వాటేంజ్‌గా చెబుతున్నారు.

Also Read: గన్నవరంలో వంశీ బలమెంత.. పట్టాభి దూకుడు టీడీపీకి మైనస్‌గా మారనుందా?

మొత్తానికి చూస్తే టీడీపీలో గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనేలా ఉంది పరిస్థితి. క్యాడర్‌ను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనే టాక్ కూడా ఉంది. అయితే ఎన్ని గ్రూపులు ఉన్నా.. సౌమ్యకు మించిన నాయకురాలు లేకపోవడంతో ఆమెకు టిక్కెట్ ఖాయమనే చెబుతున్నారు. ఇక వైసీపీలోనూ సేమ్ సీన్.. మొండితోక బ్రదర్స్‌లో ఎవరో ఒకరు అభ్యర్థి అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే పాత ప్రత్యర్థుల మధ్యే మళ్లీ పోటీ జరగనుంది. ఇక ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో.. ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాల్సిందే.