Nandyala : 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో పెట్టాలంటూ.. నంద్యాల డీఈఓ సంచలన ఉత్తర్వులు
నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో ఉంచాలంటూ డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు.

mass
Nandyala : నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో ఉంచాలంటూ డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు. గత సంవత్సరం 10వ తరగతి మాస్ కాపీయింగ్ కు సహకరించినట్లు ఆ 8 మంది టీచర్లపై ఆరోపణలు ఉన్నాయి. గతేడాది పదో తరగతి పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ ఘటనకు సంబంధించి డీఈవో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
గతేడాది పదో తరగతి పరీక్షల సమయంలో ఈ 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారు. అయతే, వీరు విధులు నిర్వర్తించిన పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన మాస్ కాపీయింగ్ ఘటన పునరావృత్తం కాకుండా ఉండేందుకు పరీక్షల సమయంలో ఆ 8 మంది ఉపాధ్యాయులను పోలీసులు స్టేషన్ లో ఉంచాలని డీఈఓ అనురాధ ఉత్తర్వులు ఇచ్చారు.
PUBG పేరుతో 10వ క్లాస్ హాల్ టిక్కెట్లు, కాపీ కొట్టిస్తూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్, 3 టీచర్లు
జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశాల మేరకు డీఈఓ అనురాధ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ 8 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వారు పని చేసే మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో 8 మంది టీచర్స్ పై వేటు పడింది. 10వ తరగతి పరీక్షలకు ఎనిమిది మంది టీచర్లను నంద్యాల డీఈఓ అనురాధ దూరం పెట్టారు.
ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగిసే వరకు టీచర్లు పోలీసు స్టేషన్లోనే ఉండనున్నారు. మరోవైపు డీఈఓ అనురాధ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లను పోలీస్ స్టేషన్ లో పెట్టాలంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.