Corona ఫ్రీ జిల్లాగా ప్రకాశం

ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఓవైపు పరీక్షలు నిర్వహిస్తూనే..వైరస్ సోకిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది ఏపీ ప్రభుత్వం. వైరస్ కట్టడికి చర్యలు తీసుకొంటోంది. అయితే..కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లాలో నమోదవుతున్న కేసులతో జిల్లా ప్రజలు భయపడిపోయారు. కానీ అధికారుల చర్యలతో ప్రస్తుతం ఈ జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు. వైరస్ నుంచి కోలుకున్న తొలి జిల్లాగా ప్రకాశం రికార్డు సృష్టించింది.
మొత్తం 63 మందికి కరోనా సోకిందనే విషయం తెలిసిందే. ఇందులో 60 మంది ఇప్పటికే కోలుకున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం మిగిలిన ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక్కడ వైద్యులు, పోలీసులు, వాలంటీర్లు, ఇతరులు చేసిన కృషి వల్లే..జీరో పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తమ సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమించారని ప్రకటనలో తెలిపింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మే 16వ తేదీ శనివారం 101 మంది డిశ్చార్జ్ అయ్యారని, దీంతో ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1353కు చేరుకుందన్నారు. అనంతపురం 37, కృష్ణా 5, కర్నూలు జిల్లాలో 47, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు డిశ్చార్జి అయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా..రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2355కు చేరింది. కర్నూలులో ఒకరు చనిపోవడంతో..మరణాల సంఖ్య 49కి చేరింది.