తిరుమలపై రాజకీయాలొద్దు… వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు…తేల్చిచెప్పిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • Published By: dharani ,Published On : May 25, 2020 / 12:42 PM IST
తిరుమలపై రాజకీయాలొద్దు… వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు…తేల్చిచెప్పిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Updated On : May 25, 2020 / 12:42 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భూముల వేలంపాటపై రాజకీయ దుమారం లేచింది. టీడీపీ, బీజేపీలు విమర్శలు మొదలెట్టాయి. అసలు ఇంకా నిర్ణయంతీసుకొలేదు. రోడ్ మ్యాప్ రెడీ చేయమన్నాం. అంతే. దీనికే ఇంత రాద్ధాంతమా? అని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు. తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దన్నారు. టీటీడీ భూముల వివాదంపై సోమవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రంలోని ఆస్తుల విక్రయ ప్రతిపాదనపై వివరణ ఇచ్చారు.  అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉన్న టీటీడీ భూములను విక్రయించుకోవచ్చని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని పాలక మండలి ఆమోదం తెలిపింది. అందులో బీజేపీకూడా భాగమేనన్నారు.

అందులో భాగంగానే, తమిళనాడులో అన్యాక్రంతం అయ్యే అవకాశం ఉన్న భూములు గుర్తించామని, ఇవి సెంటు నుంచి ఐదుసెంట్ల వరకు ఉంటాయని, వీటిని కాపాడటమూ కష్టమేనని అన్నారు. వీటిని విక్రయించడానికి గల అవకాశాలు పరిశీలించాలని గత బోర్డు సమావేశంలో చర్చించాం. వేలంపాట వేయడానికి ఉన్నఅవకాశాలపై ప్రతిపాదనలు రెడీ చేయాలని మాత్రమే నిర్ణయంతీసుకున్నాం. అంతేకాని, భూముల విక్రయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. 

స్వామివారికి భక్తులు ఇచ్చిన భూములను కాపాలన్నదే  మా తాపత్రయమని అన్నారు. ఒకవేళ, దోచుకోవాలన్న ఆలోచన ఉంటే.. టీటీడీ భూములనే అమ్మాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నప్పుడు సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములు కొట్టేయాలని చూశారని ఆరోపించారు. ప్రతిపక్షంగా, ఆనాడు టీటీడీ నిధులను కాపాడటానికి ప్రయత్నించామన్నారు. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తకాదని చెప్పారు.