Chandrababu Naidu: నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న టీడీపీ నేతలకు చంద్రబాబు గుడ్‌న్యూస్
ఎమ్మెల్యేలు బహిరంగంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండని సూచించారు.

CM Chandrababu Naidu
మార్చి నెలాఖరులోగానే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులు ఉంటాయని చెప్పారు.
“మార్కెట్ యార్డులు, దేవస్థానం వంటి వారి కోసం మీరు పేర్లు ఇవ్వాలి. పార్టీ పదవులు మహానాడు లోపు పూర్తి చేయాలి. ఎమ్మెల్యేలు బహిరంగంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. మనం పొరపాటు మాట్లాడితే విపక్షం అవకాశంగా తీసుకొంటుంది. ఎమ్మెల్యేలకు, ప్రజలకు, కేడర్ కు మధ్య సమన్వయం పెరగాలి” అని చంద్రబాబు అన్నారు.
నియోజకవర్గ నిధులు ఇవ్వాలని చీఫ్ విప్ అంజనేయిలు, బుచ్చయ్య చౌదరి కోరారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తాను చూస్తానని చంద్రబాబు చెప్పారు. కేంద్ర బడ్జెట్ తరహాలోనే రాష్ట్ర బడ్జెట్ పై కూడా విస్తృతమైన చర్చ జరగాలని అన్నారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కి ఇంకో ఝలక్.. ఆయన నిర్ణయానికి బ్రేక్
వేసవి కాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడే కేసులపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. సీనియర్లకు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసని, కొత్తవాళ్లు కూడా తెలుసుకోవాలని అన్నారు. అందదూ కలిసి ముందుకు నడవాలని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కూడా అందరు తనను రావద్దని చెప్పారని చెప్పారు.
చివరకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేసి నన్ను రమ్మన్నారని గుర్తుచేసుకున్నారు. యరపతినేని ఏర్పాటు చేసిన సమావేశంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మీటింగ్ లు పెట్టామని చెప్పారు. అప్పుడు ప్రత్యర్థుల కుట్రలను కూడా యరపతినేని సమర్థవంతంగా తిప్పికొట్టారని తెలిపారు. అలాగే 2014 లో అధికారంలోకి వచ్చామని, అందుకనే కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్లాల్సిందేనని చెప్పారు.
“జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. నాడు వివేకా హత్య, కోడికత్తి డ్రామాలు చేసి మన మీద నెపం వేశారు. ఆనాడు మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోయాం. నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కుట్రలను పసిగట్టలేక పోయింది. తాజాగా తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్ని ప్రమాద ఘటనలోనూ కుట్ర కోణం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదు” అని అన్నారు.