Papikondalu Tour : పాపికొండల విహారయాత్ర నేటి నుంచి నిలిపివేత.. కారణం ఇదే.. తప్పిన పెనుప్రమాదం..
Papikondalu : పాపికొండలు విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
Papikondalu
Papikondalu tour : గోదావరి అందాలు, పాపికొండల ప్రకృతి సోయగాలు ఆస్వాదించేందుకు ప్రతి వారాంతంలో వేలాది మంది పర్యాటకులు తరలివెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం పాపికొండలు విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రంపచోడవరం ఆర్డీవో కె. స్వాతి శనివారం ప్రకటించారు.
ఇటీవల దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఓ బోటులో దాదాపు 89మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్లేసరికి సాంకేతిక లోపం ఏర్పడటంతో అప్రమత్తమైన డ్రైవర్ బోటును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. కొందరు తమను కాపాడాలంటూ కేకలు పెట్టారు. అయితే, పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే అక్కడి సిబ్బంది మరో బోటును రప్పించి పర్యాటకులను సురక్షితంగా తరలించారు.
అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన విషయం బయటకు రావడంతో శనివారం అధికార యంత్రాంగం దేవీపట్నం బోటింగ్ పాయింట్ కు చేరుకొని ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. బోటు ఎందుకు ఆగిపోయింది..? ఘటనను ఎందుకు గోప్యంగా ఉంచారు..? భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించారా? అనే అంశాలపై సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇటీవలకాలంలో పలు సందర్భాల్లోనూ బోటులో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన అధికారులు.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు బోట్ల ఫిట్ నెస్, భద్రతా ప్రమాణాలపై పరిశీలన చేయిస్తున్నారు. వీటిపై నివేదిక వచ్చిన తరువాతనే బోటింగ్ పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. దీంతో పాపికొండలకు వెళ్లాలని భావిస్తున్న పర్యాటకులు తమ ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకోవటం మంచిందని అధికారులు సూచించారు.
