Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీ‌వాణి ఆఫ్‌లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు..

శ్రీవాణి టికెట్ల రద్దును గుర్తించి భక్తులు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి భక్తులకు కోరింది టీటీడీ.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీ‌వాణి ఆఫ్‌లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు..

Updated On : December 25, 2025 / 8:38 PM IST

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు చేసింది. మూడు రోజుల పాటు టికెట్ల జారీని క్యాన్సిల్ చేసింది. తిరుమ‌ల‌లో అనూహ్య ర‌ద్దీ నేపధ్యంలో ఈ నెల 27, 28, 29వ‌ తేదీల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని ర‌ద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తిరుమ‌ల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట ఎయిర్ పోర్టులో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్లలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేయ‌బ‌డ‌వని స్పష్టం చేసింది. శ్రీవాణి టికెట్ల రద్దును గుర్తించి భక్తులు తమ దర్శన ప్రణాళికలు రూపొందించుకోవాలని టీటీడీ కోరింది.

దివ్య దర్శనం టోకెన్లకు పోటెత్తిన భక్తులు..
అటు తిరుమల అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లకు భక్తులు పోటెత్తారు. సర్వ దర్శనం టోకెన్లు పూర్తి కావడంతో నడకదారి భక్తుల దివ్య దర్శనం టోకెన్లకు భారీగా ఎగబడ్డారు. దాంతో టీటీడీ సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది అలర్ట్ అయ్యారు. క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా పరిస్థితిని అదుపు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

భక్తజన సంద్రంగా తిరుమల..
అటు తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. తిరుమల కొండ భక్తజన సంద్రంగా మారింది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. శిలాతోరణం వరకు కూడా సర్వ దర్శనం క్యూలైన్లు ఉన్నాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నారాయనగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. నారాయణగిరి దాటి శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఇక్కడి నుంచి ఆక్టోపస్ భనవం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది.

Also Read: 2026లో బంగారంపై పెట్టుబడి పెడితే మీపై డబ్బుల వర్షం కురుస్తుందా? లేదంటే వెండిపైనా..?