శ్రీకాళహస్తిలో ఆ ఇద్దరి మధ్య ఆగని పొలిటికల్ వార్!

  • Published By: sreehari ,Published On : December 23, 2019 / 03:43 PM IST
శ్రీకాళహస్తిలో ఆ ఇద్దరి మధ్య ఆగని పొలిటికల్ వార్!

Updated On : December 23, 2019 / 3:43 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో బీజేపీ నేతలకు రోజుకో తగవు జరుగుతోందంట. బీజేపీ నేత కోలా ఆనంద్, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అంటున్నారు. పట్టణంలోని వార్డు పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ఓ చోటా బీజేపీ నేత అడ్డుకోవడంతో నెలన్నర క్రితం ఈ వివాదం మొదలైంది.

ఆ బీజేపీ నేతపై పోలీసు కేసు నమోదైంది. ఇక అప్పటి నుంచి ఇక్కడ రోజూ గొడవలే. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు ఒకటికి రెండు మార్లు ఆందోళనకు దిగారు. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు కోలా ఆనంద్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అమిత్ షాకు ఫిర్యాదు :
తమ నేతల అరెస్టులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెనుకుండి చేయిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆగడాలు ఎక్కువైపోతున్నాయంటూ చివరకు జిల్లా ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయినా వ్యవహారం సద్దుమణగక పోవడంతో ఇక లాభం లేదనుకున్నారట కోలా ఆనంద్‌. తనకున్న పరిచయంతో నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ప్రధాని మోదీని సైతం కోలా ఆనంద్ కలవడం విశేషంగా ఇక్కడ చెప్పుకుంటున్నారు.

కాళహస్తిలో కోలా దూకుడు :
కోలా ఆనంద్ చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి దగ్గరగా ఉన్నారు. మారిన పరిణామాల నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం బీజేపీలోకి వెళ్లారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆయన బరిలో దిగినా పెద్దగా ఓట్లు రాబట్టలేకపోయారు. తాజాగా ఏపీలో బీజేపీ బలం పెంచుకుంటుండగా, కాళహస్తిలో కోలా దూకుడు పెంచారు. అధికార వైసీపీపై విరుచుకుపడుతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

కాళహస్తిలో అధికార పార్టీకి తానే ప్రధాన ప్రత్యర్థిగా ముద్ర వేసుకోడానికి ఆయన ఇలా ముందుకెళుతున్నారని అంటున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఈ గొడవలు చివరకు ఎలా దారితీస్తుందోనని ఆయన తేల్చుకోలేకపోతున్నారని టాక్ నడుస్తోంది.