ఏపీ బీజేపీలో రాజుకున్న అసెంబ్లీ సీట్ల చిచ్చు .. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన
బద్వేలు సీటు విషయంలో పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందని పనతల సురేష్ఆ వేదన వ్యక్తం చేశారు.

Panatala Suresh
AP BJP : ఏపీ బీజేపీలో అసెంబ్లీ సీట్ల చిచ్చు రాజుకుంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా వెళ్తున్న విషయం తెలిసిందే. కూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం బుధవారం సాయంత్రం ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానం తీరుపై తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ బద్వేలు సీటు ఆశించిన పనతల సురేష్ ఆయన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. బద్వేలు సీటు విషయంలో పురందేశ్వరి పునరాలోచించాలని ప్లకార్డు చేతబూని బైటాయించి నిరసన తెలిపారు.
Also Read : AP Bjp Mla Candidates : ధర్మవరం టికెట్ ఆయనకే- ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే
పనతల సురేష్ 10టీవీతో మాట్లాడుతూ.. బద్వేలు సీటు విషయంలో పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి నిమిషం వరకు నాకే సీటు అని చెప్పారు. కానీ, బీజేపీ కండువా వేసుకోని రోషన్నకు టికెట్ ఇవ్వడం నాకు బాధ అనిపించిందని అన్నారు. మా పార్టీలోనే చాలా మంది సీనియర్లు ఉన్నారు.. వారికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. బద్వేలులో రోషన్న ఓడిపోయే వ్యక్తి. అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు. తిరుపతి సీటు విషయంలోనూ ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికే సీటు ఇచ్చారని పనతుల సురేష్ అన్నారు.
Also Read : CM Jagan : షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని సీటు విషయంలో పునరాలోచించాలని కోరుతున్నాను. రోషన్నకు బద్వేలులో సహకరించే ప్రసక్తే లేదు. బద్వేలు సీటు విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచించకుంటే త్వరలో నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అంటూ పనతల సురేష్ చెప్పారు.