రాసిపెట్టుకోండి.. 2029లో కూడా వచ్చేది కూటమి ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్
"ఏదైనా మాట్లాడదామంటే రౌడీ మూకలు వచ్చేవి. నిస్సహాయతతో కూడిన అధికారులు ఉండేవారు" అని పవన్ కల్యాణ్ చెప్పారు.

Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఏపీ సర్కారు సభ నిర్వహిస్తోంది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 2029లో కూడా మరోసారి కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘రాసి పెట్టుకోండి.. 2029లో కూడా కూటమే వస్తుంది’ అని కుండబద్దలు కొట్టారు.
“ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం. చాలా కష్టాల మధ్య, ఒత్తిళ్ల మధ్య ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని అధికారంలోకి వచ్చాం. ప్రత్యేకించి నేను 2014 నుంచి ఏపీ అభివృద్ధి జరగాలని కోరకుంటున్నాను. విభజన తర్వాత రాష్ట్రం ఎలా అయిందో చూశాం. నిస్వార్థంగా పని చేసుకుంటూ వచ్చాను. 2019 నుంచి 2024లో విధ్వంసకర పాలన జరిగింది.
ఏదైనా మాట్లాడదామంటే రౌడీ మూకలు వచ్చేవి. నిస్సహాయతతో కూడిన అధికారులు ఉండేవారు. వీటన్నింటి మధ్యలో రాష్ట్ర విలవిలలాడిపోయింది. ప్రజాస్వామ్యహితాన్ని కోరుకునే వారికి ఆందోళన కలిగించింది. అప్పటి పరిస్థితులను గుర్తుకు తెచ్చుకోవాలి.
మమ్మల్ని అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ ఇబ్బందులు పెట్టారు. ఏదైనా మాట్లాడాలంటే అందరికీ భయం వేసేది. అధికారులు ఎందుకు మాట్లాడడం లేదని అడిగాను. నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయారు.
నన్ను జగన్ ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. విశాఖలో 2024 మొదట్లో ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ల ఇష్టారాజ్యంగా పాలన కొనసాగించారు. ఇప్పుడు మాకు అధికారం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తుంది.
ప్రభుత్వాన్ని తిరిగి గాడిన పెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఉన్న అనుభవం మాకు చాలా ఉపయోగపడుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నాం. పెన్షన్లను పెంచారు” అని తెలిపారు.